డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు కవిత: బేతాళుడి నిరీక్షణ

By telugu teamFirst Published Jun 11, 2020, 1:47 PM IST
Highlights

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కునే చైతన్యాన్ని కల్పించడానికి డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు భేతాళుడి నిరీక్షణ అనే కవిత రాశారు.

ప్రాణంలేని పురుగు శరీరంలో
అసహనంతో బేతాళుడు
ఏ మాంత్రికుడూ ప్రేరణ ఇవ్వడు
చిక్కుముడి విప్పేందుకు ఏ విక్రమార్కుడూ రాడు
అస్తిత్వమే చిక్కుముడిగా మారి 
అగమ్యగోచరంగా బేతాళుడు
చెట్టుపైకి వెళ్ళకుండా
విక్రమార్కుడి ఇంట్లో పాగా వేయాలని ఆరాటం

'త్వరగా వచ్చేయ్'- 
ఐసోలేషన్ వార్డులోని ముత్తాత  సందేశం
'ఎప్పుడొస్తావ్'- 
క్వారంటైన్ కేంద్రంలోని తాత బేతాళుడూ అదే ప్రశ్న
'నేనూ బకరా కోసం చూస్తున్నా'- 
రోడ్డుపై ఉన్న తండ్రి బేతాళుడి ఆశాభావం
సెల్లు ఫోను సందేశాలు మోత మోగిస్తున్నా
గల్లీలో ఒక్కడూ దొరకడు
ఎన్నో చిక్కుప్రశ్నలు సిద్ధం
వ్రతభంగం చేసుకునేవాడికోసం అన్వేషణ

చూసీ చూసీ వెయ్యిన్నొకటో సారి
స్వీయ నిర్బంధంలోని విక్రముడికో సవాలు
గల్లీలోకి రమ్మని గంభీరపు సందేశం
ఇంట్లో విక్రమార్కుడికి క్షణం తీరిక లేదు
టీవీ చూస్తూ, వంటగది వాసన ఆఘ్రాణిస్తూ
కారప్పూస రుచి ఆస్వాదిస్తూ
కథల పుస్తకాలు చదువుతూ 
చతుర్ముఖ వ్యాసంగంలో విక్రమార్కుడు
కుక్కర్ మోతలో లుప్తం
సెల్లు సందేశం శబ్దం
గంటసేపు వేచి చూసి రీసెండ్ కొట్టిన బేతాళుడికి రిప్లై-
లాక్ డౌన్ లో బయటికి రానని
'వస్తావా? చస్తావా?'-  బేతాళుడి బెదిరింపు
'రాకుండా చంపుతా'-  విక్రముడి జవాబు
వీధిలో దీనంగా బేతాళుడు

ఎడారిలో నీటిబొట్టులా నిర్మానుష్యంగా వీధులు
బైటికి వచ్చేవారూ రక్షణ కవచాలతో..
పురపాలక సిబ్బంది స్ప్రే చేసే మందు వాసన 
బేతాళుడికి వాంతులు
పరిస్థితిపై మూడు తరాల పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్
అందరి పరిస్థితీ అదేనని కళ్లకు కనబడ్డ నిజం
డాక్టర్లపై ముత్తాత 
నర్సులపై తాత
పోలీసులపై తండ్రి 
ఆగ్రహావేశాల వాగ్బాణాలు
నిరాశాజనక వాతావరణంలోనూ 
స్వీయ నిర్బంధ వ్రత భంగం చేసుకునే వారికోసం 
నిరీక్షణలో బేతాళుడు

click me!