క్రాంతి ఉంటేనే సంక్రాంతి లేకుంటే అంతా భ్రాంతి అంటూ హైదరాబాద్ నుండి డా.చీదెళ్ళ సీతాలక్ష్మి రాసిన"మార్పు" కవితను ఇక్కడ చదవండి:
పొద్దులో మార్పు
నడకలో మార్పు
దక్షిణ దిశ నుండి
ఉత్తర దిశకు మార్పు
అయినా ఆగని పయనం
వెలుగు కిరణాల నయనం
నిత్య చైతన్య దీప్తి
అందరికీ స్ఫూర్తి!!
ఊరొదిలి పట్నం చేరినా
దేశమొదలి విదేశాల బాట పట్టినా
ఆగని బతుకు ప్రయాణం
మదిలో కలిగిన ఉత్తేజం!!
undefined
కొత్త అల్లుళ్ళతో సందడి
ఇళ్ళన్ని హడావిడి
పిండి వంటలు
గాలి పటాలు
బంతిపూల తోరణాలు
ముగ్గులు పరిచిన వాకిళ్ళు
పూలతో ముస్తాబైన గొబ్బెమ్మలు!!
కుండలతో నోములు
పితృ తర్పణాలు
తెరచుకున్న ఉత్తర ద్వారాలు
కోడి పందాల సంబరాలు
గాలిలో అమాయక జీవులు!!
దిశలోనే మార్పు
దశ మారేదెప్పుడు
సూర్యుని గతిలోనే మార్పు
మస్తిష్కంలో ఎప్పుడు??
మారని దీనుల బతుకులు
బద్ధకానికి తిలోదకాలు
ఉత్తేజానికి సవాళ్లు
సంతోష సాగరాలు!!
దక్షిణ లేక పనులు
మూలకు పడ్డ ఫైళ్ళు
ఉత్తరదిక్కుకు పోయేదెన్నడు!!
క్రాంతి ఉంటేనే సంక్రాంతి
లేకుంటే అంతా భ్రాంతి
పొద్దులో కాదు మార్పు
ఎదలో రావాలి మార్పు!!