ఎగురుతున్న పతంగి బతుకును దాసరి మోహన్ కవితలో చదవండి.
సెంటర్ కమ్మలాగ దాక్కుని
ప్రశాంతంగా మిగలాలనుకున్న
లక్ష్యాలు పెట్టి బతుకును చింపేసారు
అడుగడుగు నిర్దేశించబడినదే
కొలతలు లెక్కలే ప్రమాణం
పక్కోడి కన్నా ఎక్కువ ఎగరాల్సిందే
undefined
మూడు ముడులు కట్టాక
దారం ఆమె చేతిలొకి
ఇక పరిధి దాటేది లేదు
పిల్లా పాప అతికాక
కోరికలు కత్తిరించబడ్డాయి
నాలుగు మూలలు మూలుగు కుంటు
బాధ్యతలు నడుము చుట్టూ
అటు ఇటు వంగేది లేదు
రెప రెప కొట్టుకోవడం తప్ప
సమాజం నీతి చిట్టా అంటించిది
కట్టుబాట్లతో కదలిక మెలికలు
వెనకాల వెక్కిరింపులు వినబడుతూనే
ముందుకు వెనక్కు సతమతం
ఎదురు గాలికి ఎగిరి నప్పుడల్లా
వెనక్కే లాగుతుంటారు పని కట్టుకుని
ఎంత ఆడితే ఆంత
ఇంటిల్లి పాదికి తమాషా
శిలువ మాత్రం నీ పైనే హమేశా
బ్రేక్ లేకుండా గారడీ
మందిని సంతోష పెట్టడానికే పుట్టినట్లు
వురికి వురికి వూపిరి సన్నగిల్లి పోతోంది
దేవుడు కనుకరించి కట్ చేస్తే బాగుండు
చెట్టో చేమో ఒడిలో వాలి పోదు
అప్పటి వరకు పతంగిలా
నింగికి నేలకు మధ్య వేలాడుతూ...