
చెంగుమనే చెంగలింపుల నెమ్మదితనం
నరాల్లో పలచనైన జిగిబిగి ప్రవాహం
పెయ్యి మీద నిగారింపు పొడలో తేడా
పెద్దమనిషి తనం ఆవరిస్తున్న పెద్దరికం
మోకాళ్ళ కీళ్లు కలుక్కు సులుక్కులు
ఎక్కడాలు దిగడాలు తగ్గించే వీచికలు
తల మీద వెంటుకల తెలతెల్లని మార్పులు
తాపతాపకు అద్దం చూసుడెందుకనే లోచనలు
దవడ పండ్లలోంచి జివ్వుమన్న రాగం
బొక్కలు ఎక్కువ తక్కువ నమల వద్దనే
తిన్నది తిన్నట్టుగ అరిగి కరిగిపోతలేదా
కొంచెం ఆచి తూచి తినమనే సూచిక
పేరు మరచి రూపమే గుర్తుకొస్తున్నదా
మనోఫలకం లోన స్పేస్ నిండిందనే ఎరుక
ప్రకృతిలో సహజాతి సహజం ఆకురాలు కాలం
దేహంలోనూ జీవకణ విభజన తరిగే గుణం.