మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ధీమా.. టీఆర్ఎస్ తోనే పోటీ!

By Prashanth MFirst Published Nov 11, 2019, 7:44 PM IST
Highlights

పుర పోరుకు కమల దళం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రజల ఆదరణతో గెలుపొందడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ముఖ్యనేతలు, శ్రేణలను సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బాస సత్యనారాయణ రావు అధ్యక్షతన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

సమావేశానికి ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేతలు ప్రజల్లో విస్తృతంగా తిరగాలని సూచించారు. సమావేశానికి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, క్లస్టర్ ఇంఛార్జులు, మండల అధ్యక్షులు హాజరయ్యారు.  క్షేత్రస్థాయిలో అవినీతి పెరిగిందని ఆరోపించారు.

మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలో మంజూరైన పనులకు నిధులు విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. యువరాజు నియోజకవర్గంలో పరిస్థితే అధ్వానంగా ఉంటే మిగిలిన మున్సిపాలిటీల పరిస్థితి మరీ దయనీయమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ అసలు పోటీనే కాదని అన్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనానికి వివరించాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ నోట్ల రాజకీయాలు చేసినా... ప్రజలు మంచితనానికే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యపై పోరాడుతూ జనాదరణ పొందాలని అన్నారు. సమావేశంలో మాజీమంత్రి పెద్దిరెడ్డి,  కిసాన్ మోర్చా నేషనల్ జనరల్ సెక్రటరీ పొల్సాని సుగుణాకర్ రావు మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, మాజీ మేయర్ శంకర్, బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నరోత్తమ్ రెడ్డి, , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్ రెడ్డి, ఓదేలు, కొట్టె మురళీకృష్ణ, శివరామకృష్ణ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ రాజేందర్ రెడ్డి, హనుమంత్ గౌడ్, కరీంనగర్ సిటీ ప్రెసిడెంట్ బేతి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

click me!