కరోనాకు బ్లీచింగ్... కరీంనగర్ లో పరిస్థితి ఇది: మంత్రి గంగుల

By Arun Kumar PFirst Published Mar 19, 2020, 10:33 PM IST
Highlights

కరీంనగర్ ప్రజల్లో కరోనా వైరస్ భయాందోళన నెలకొనడంతో దాన్ని దూరం చేసే ప్రయత్నం చేశారు మంత్రి గంగుల కమలాకర్.  

ఇండోనేషియా వాసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు బయటపడ్డప్పటి నుండి కరీంనగర్ వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. వారు పట్టణంలోనే నివాసముండటంతో ఈ వైరస్ వ్యాప్తి చెంది వుంటుందన్న అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి. అయితే అలాంటి అనుమానాలేమీ పెట్టుకోవద్దని... గురువారం చేపట్టిన పరీక్షల్లో ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదని మంత్రి గంగుల కమలాకర్  వెల్లడించారు. కాబట్టి పట్టణవాసులు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. 

ఇప్పటివరకు తెలంగాణా రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఒక్కరూ తెలంగాణ వాసులు కాదున్నారు. కరీంనగర్ నుంచి ఎనిమిది కేసులు పాజిటివ్ నమోదయిన నేపథ్యంలో ఇవాళ 100 టీములతో  6126 ఇళ్లలో తనిఖీలు చేశామన్నారు. 25 వేల మందిని స్క్రీనింగ్ చేశామన్నారు. 

నగరంలో 90 వేల ఇళ్లు ఉన్నాయని... వాటన్నింటిలో తనిఖీల ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. ఇప్పటివరకు దాదాపు 25 వేల మందిలో ఏ ఒక్కరికీ కరోనా లక్షణాలు లేవన్నారు. కేవలం 20 మందికి ట్రావెల్ హిస్టరీ ఉంది కాబట్టి ఇంట్లోనే ఉండమని చెప్పినట్లు... మరో ఆరుగురికి దగ్గు, జలుబు లక్షణాలు వుండటంతో వాళ్ళూ ఇళ్లలోనే ఉండాలని సూచించామన్నారు. 

కరోనా సోకిన విదేశీయులతో ప్రాథమిక పరిచయం ఉన్న ఇద్దరికి తగిన సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. రేపట్నుంచి ఇదే పద్దతి పాటిస్తామని... భయం అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. ప్రజలకు ఏలాంటి నిర్బంధం లేదని... అయితే గుంపులుగా ఉండకండి అని విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నామని అన్నారు. 

కరోనా ఎఫెక్ట్... తెలంగాణలో ఏర్పాటుచేసే చెక్ పోస్టులివే...: సీఎం కేసీఆర్

ఇవాళ వ్యవహరించిన తీరుగానే మరి కొన్ని రోజులు ఉండాలని సూచించారు.  నిర్లక్ష్యం మాత్రం తగదన్నారు. రాష్ట్రంలో మాస్కుల కొరత ఉందన్న.... దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సానిటైజర్ల కొరత లేకుండా చూస్తామన్నారు. నగరం అంతటా 65 సిలిండర్లతో హైపో క్లోరైడ్ స్ప్రే చేయిస్తామని.... బ్లీచింగ్ కూడా జరుగుతుందన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని...మీడియా ద్వారా ఇచ్చిన సూచనలతో ప్రజల్లో అవగాహన వచ్చిందన్నారు. టిఫిన్ సెంటర్లు, ఇతర కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా ఉండవద్దని కోరారు.

 నిన్న రాత్రి కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు తనిఖీల కోసం పంపిన వారికి కూడా కరోనా లేదని తెలిసిందన్నారు. అయినా కూడా వారిని మరోసారి చలిమెడ ఆసుపత్రికి పంపించి చెక్ చేయిస్తున్నట్లు తెలిపారు.కరీంనగరాన్ని సురక్షితంగా ఉంచడం అందరి సామాజిక బాధ్యత అన్నారు. తనిఖీల ప్రక్రియ కొనసాగేందుకు ప్రజలు సహకరించాలన్నారు. 

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో పారిశుధ్యం నెలకొనేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఇండోనేషియా వాసులు కేవలం 200 మీటర్ల పరిధిలో మాత్రమే తిరిగారని... వాళ్ళతో కలిసిన, మాట్లాడిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు లేవని మంత్రి గంగుల స్పష్టం చేశారు. 
 

click me!