ఫ్లెక్సీలు తయారు చేసే మిషనరీ రాక ముందు చేతి నిండా పని ఉండేది. కానీ, ఆ తర్వాత కాలంలో ఆదరణ లేక కుటుంబాన్ని పోషించడమే భారంగా రాజు కాలం వెల్లదీస్తున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో కూడా రాజు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సంకల్పించారు.
కరీంనగర్: ఆధునిక సాంకేతికత కారణంగా చేతి నిండా కళ ఉన్నా.. కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారింది. అయినా సమాజాన్ని చైతన్య పరిచేందుకు తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నాడు ఓ ఆర్టిస్ట్. కళ కళ కోసం ప్రజల కోసం, ప్రజలను చైతన్యం వైపు నడిపించేందుకు అని ‘కరోనా’పై చైతన్యం కలిగిస్తున్నాడు ఆ కళాకారుడు. తన చేతితో నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) మహమ్మారి గురించి అవగాహన కల్పించేందుకు ప్రధాన రహదారులపై బొమ్మలు వేస్తూ, గ్రామాల్లో కరోనా రాకాసి వేషం వేసుకుని ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఆ ఆర్టిస్ట్ పేరు సాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరుకుచెందిన కళాకారుడు.
చైతన్యం ‘కరోనా’..
ఫ్లెక్సీలు తయారు చేసే మిషనరీ రాక ముందు చేతి నిండా పని ఉండేది. కానీ, ఆ తర్వాత కాలంలో ఆదరణ లేక కుటుంబాన్ని పోషించడమే భారంగా రాజు కాలం వెల్లదీస్తున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో కూడా రాజు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సంకల్పించారు. తన కళనే ఆధారం చేసుకుని ఎవరి సాయం లేకుడానే సిటీలోని రోడ్లపై కరోనా వ్యాధి ఎంత ప్రమాదకరమో వివరిస్తూ బొమ్మలు వేస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద వేస్తున్న ఈ బొమ్మలు చూసైనా ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరుతున్నాడు.
కరోనాపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందనీ, ఇందుకు ఏం చేయాలో కూడా వివరిస్తూ రోడ్లపైనే నినాదాలు రాస్తున్నారు. డిప్లొమా చేస్తున్న తన కొడుకు భార్గవ సాయి ఫణీంద్రచే కరోనా రక్కసి వేషం వేయించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ఈ వేషధారణలో వివరిస్తున్నారు. ప్రజలు ఇళ్లలో ఉండే తాము చేస్తున్న ప్రచారానికి అవసరమైన మైక్ సెట్ లేకపోవడంతో మానకొండూరు ఎస్సై వాహనం ద్వారా కొన్ని గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించినట్టు సాయి చిత్ర రాజు తెలిపారు.
సాయి చిత్ర రాజు కరోనా కట్టడికి చేపట్టిన ప్రచారంలోనూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. రాజు తన కొడుకు సహాయంతోనే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అందరినీ సామాజిక దూరం పాటించాలని చెప్పే తానే పాటించకుండా ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని భావించి కొడుకు తాను మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.
తాను చేస్తున్న ఈ ప్రచారం వల్ల కొద్దిలో కొద్ది మందైనా ఇంటికే పరిమితమై లాక్ డౌన్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా తోటి వారిని చైతన్యవంతులను చేసే యజ్ఞంలో తానూ భాగస్వామిగా మారిపోయానన్నారు. కరోనా పూర్తి స్థాయిలో తగ్గిపోయిన తర్వాత అయినా ఆర్టిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.