వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లిన తాతా మనవడు మానేరు వాగులో పడి గల్లంతైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.
కరీంనగర్: వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లిన తాతా మనవడు మానేరు వాగులో పడి గల్లంతైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. తాతతో సరదాగా పొలానికి వెళ్లిన ఇద్దరు చిన్నారుల్లో ఓ బాలుడు నీటమునగ్గా మరో బాలుడు సురక్షితంగా వున్నాడు. తాతా మనవళ్ల గల్లంతుతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది.
ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఒగ్గు మల్లయ్య(65) తన మనుమడు అఖిరేష్ నందన్(9) తో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. అయితే పొలం వద్ద మానేరు వాగులో ఏర్పాటుచేసిన మోటర్ వద్ద నాచు బాగా పేరుకుపోవడంతో వాటిని మల్లయ్య తీస్తుండగా మనువడు నందన్ కూడా సరదాగా నీటిలోకి దిగాడు.
undefined
వీడియో
ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యారు. ఎంత సేపటికీ వారు ఒడ్డుకు చేరకపోవడంతో వారితో పాటు అక్కడే ఉన్న చిన్న మనుమడు గ్రామంలోకి వెళ్లి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు.
దీంతో స్థానికుల సమాచారంతో పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని తాతా మనవడి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థుల సాయంతో వాగులో మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.