క్వారంటైన్ నుండి తప్పించుకున్న దంపతులు... రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిపై పోలీస్ కేసు

By Arun Kumar PFirst Published Mar 26, 2020, 5:10 PM IST
Highlights

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోదించేందుకు విదేశాల నుండి వచ్చిన ఓ జంటను హోం క్వారంటైన్ లో వుంచగా వారు తప్పించుకుని బయటకు వెళ్లిన సంఘటన కరీంనగర్ లో  చోటుచేసుకుంది. 

కరీంనగర్: ప్రపంచాన్ని వణికిస్తూ ఇటలీ వంటి సుందర దేశాన్ని స్మశానవాటికగా మారుస్తోంది కరోనా మహమ్మారి. అయినా కూడా భారత ప్రజలు మారడం లేదు. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తూ లాక్ డౌన్ ప్రకటించినా, పోలీసులు లాఠీలకు పనిచెప్పినా కొంతమందిలో మార్పు రావడం లేదు. ఇందుకు తెలంగాణ ప్రజలేమీ అతీతులు కాదు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే క్వారంటైన్ కేంద్రాల నుండి కొందరు పారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసినా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే వున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ జంట హోంక్వారంటైన్ లో వుండకుండా ఓ కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యారు.   

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 7న యూఎస్‌ఏ నుంచి స్వదేశానికి వచ్చిన ఓ జంట కరీంనగర్‌ లోని తమ నివాసంలోనే క్వారంటైన్  వున్నారు. అయితే వీరు తమ క్వారంటైన్ సమయం ముగియక ముందే ఇంట్లోంచి బయటకు వచ్చారు. కేవలం బయటకు రావడమే కాదు కరీంనగర్ నుండి జగిత్యాలకు వెళ్లి తమ బంధువుల ఇంట్లో జరిగిన సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అయితే ఈ దంపతుల చేతికి స్టాంప్ వుండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన జగిత్యాల ఆర్డీవో నరేందర్‌, సీఐ జయేష్‌రెడ్డిలు ఆ దంపతులను అదుపులోకి తీసుకుని అంబులెన్స్‌ లో తిరిగి క్వారంటైన్ హోమ్‌ కు తరలించారు. 

ఎలాంటి అనుమతి లేకుండా సంవత్సరీకం నిర్వహిస్తున్న రెవెన్యూ విశ్రాంత ఉద్యోగిపై కూడా పోలీసుల కేసు నమోదు చేశారు. హోంక్వారంటైన్ లో వుండకుండా బయటకు వచ్చిన దంపతులపైనా  చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 
 

click me!