కరీంనగర్ లో కరోనా కలకలం కొనసాగుతోంది. ఇంతకాలం కరీంనగర్ పట్టణానికే పరిమితమైన ఈ కరోనా భయం ఇప్పుడు జిల్లాకు పాకింది.
కరీంనగర్: ఇంతకాలం కేవలం కరీంనగర్ పట్టణవాసుల్లో నెలకొన్న కరోనా వైరస్ భయం ఇప్పుడు జిల్లామొత్తానికి పాకింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారిని కొన్ని గ్రామాల ప్రజలు శివార్లలోనే అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రామాల శివార్లలో కాపలా కాస్తున్న దృశ్యాలు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కనిపిస్తున్నాయి.
ఇలా వేములవాడ మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన ప్రజలు తమ గ్రామానికి ఎవరు రాకండి అంటూ కోరుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ''మీ గ్రామానికి మేము రాము. అలాగే మా గ్రామాలకు మీరెవ్వరూ రాకండి'' అని కోరుతున్నారు. మిగతా గ్రామానికి ఉన్న ప్రధాన రోడ్లకు అడ్డుకట్ట వేసుకుని కొందరు అక్కడే కాపలా కాస్తున్నారు. ఇక గ్రామస్థులంతా గ్రామంలోనే ఉండే విధంగా తీర్మానం చేసుకున్నారు.
అదేవిధంగా వీర్నపల్లి మండలకేంద్రంలోనూ ఇలాగే ఇతర ప్రాంతాలవారిని అడ్డుకుంటున్నారు. ఇతర గ్రామాలతో అనుసంధానిస్తూ గ్రామం చుట్టూ వున్న రోడ్లను మూసివేయడం జరిగింది. వేరే గ్రామాల నుండి మండలకేంద్రానికి రావద్దని వీర్నపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గ్రామస్తులు గ్రామం దాటి వెళ్ళడానికి వీలులేదని సూచించడం జరిగింది. కేవలం అత్యవసర సేవలకు మత్రమే అనుమతి ఉంటుందని... మండల ప్రజలందరూ సహకరించాలని వీర్నపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు.