పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు.. 26/11 ముంబయి దాడుల మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష

Published : Apr 08, 2022, 07:16 PM ISTUpdated : Apr 08, 2022, 07:33 PM IST
పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు.. 26/11 ముంబయి దాడుల మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష

సారాంశం

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహవ్యవస్థాపకుడు, 26/11 ముంబయి దాడుల వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌కు రెండు కేసుల్లో 31 ఏళ్ల జైలు శిక్ష పడింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఇప్పటికే ఇలాంటి ఐదు కేసుల్లో దోషిగా తేలి లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.  

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, జమాత్ ఉద్ దవా చీఫ్, 26/11 ముంబయి దాడుల వెనుక మాస్టర్ మైండ్‌గా ఉన్న హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్ష విధించినట్టు పాకిస్తాన్ మీడియా రిపోర్ట్ చేసింది. అంతేకాదు, ఆయన ఆస్తులన్నింటినీ సీజ్ చేయాలని ఆదేశించింది.

ఇలా హఫీజ్ సయీద్‌ కేసుల్లో దోషిగా తేలడం శిక్ష పడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయనపై దాఖలైన పలు ఉగ్రవాద కేసుల్లో దోషిగా తేలాడు. గతంలోనూ ఇలాంటివే ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికంగా సహకరించాడని, నిధులు సమకూర్చాడన్న ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. అలాంటి ఐదు కేసుల్లో 70 ఏళ్ల హఫీజ్ సయీద్ దోషిగా తేలాడు కూడా. వాటిలో 36 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాలనే తీర్పులు వచ్చాయి. ఈ తీర్పులకు అనుగుణంగా ఆయన లాహోర్‌లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నట్టు తెలుస్తున్నది.

అంతర్జాతీయ సంస్థలు గుర్తించిన ఉగ్రవాద జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నాడు. ఐరాస గుర్తించిన ఉగ్రవాది ఈయన. అమెరికా ప్రభుత్వం సయీద్ మీద 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. యూఎస్ ట్రెజరీ శాఖ హఫీజ్ సయీద్‌ను స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. 2008లో ఐరాస భద్రతా మండలి తీర్మానం 1267 జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నారు.

ఇదిలా ఉండగా, హఫీజ్ సయీద్‌పై మన దేశంలోనూ అభియోగాలు ఉన్నాయి. హఫీజ్ సయీద్‌పై ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు గతేడాది ఎన్‌బిడబ్ల్యు (నాన్ బెయిలబుల్ వారెంట్) జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో టెర్రర్ ఫండింగ్ కేసులో ఈడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఆరోపణలను కోర్టు గుర్తించింది. దీనిలో భాగంగానే హఫీజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ముంబై దాడులకు సూత్రధారి హఫీజ్ సయీద్ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని.. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌తో పాటు ఐఎస్ఐ నుంచి అతను డబ్బును స్వీకరిస్తున్నట్లు ఇడి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేష్ రానా ఎన్‌ఐఏ స్పెషల్ జడ్జి ప్రవీణ్ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, పాకిస్తాన్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఈ ఏడాది జనవరిలో ఉగ్రవాద నిధుల కేసులో హఫీజ్ సయీద్‌తో పాటు ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దావా (జెయుడి)కు చెందిన ముగ్గురు సభ్యులకు 6 నెలల శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే