26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి అరెస్ట్: పాక్ కీలక ప్రకటన

By Siva KodatiFirst Published Jan 2, 2021, 8:57 PM IST
Highlights

భారత్‌తో పాటు ప్రపంచాన్ని నివ్వెరపరిచిన 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (61)ని పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు శనివారం పాక్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు

భారత్‌తో పాటు ప్రపంచాన్ని నివ్వెరపరిచిన 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (61)ని పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు శనివారం పాక్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు.

2008లో ముంబై ఉగ్ర దాడుల మాస్టర్ మైండ్ లఖ్వీని తమ  కౌంటర్ టెర్రరిజం విభాగం (సీటీడీ) అరెస్టు చేసిందని పాక్‌ ప్రకటించింది. అయితే లఖ్వీని అరెస్టు చేసిన ప్రదేశం, ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం ప్రస్తావించకపోవడంతో దాయాదిపై అనుమానాలు కలుగుతున్నాయి.

ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూరుస్తున్నాడన్న అభియోగంతో అతడిని అరెస్ట్ చేసినట్టు సీటీడీ తెలిపింది. లఖ్వీ ఒక డిస్పెన్సరీని నడుపుతూ, ఉగ్రవాద చర్యలకు, ఆ నిధులను ఉపయోగిస్తున్నాడని అధికారులు వెల్లడించారు.

ఈ నిధులను ఉగ్రవాదులకు ఫండింగ్ చేయడంతో పాటు వ్యక్తిగత అవసరాలకు కూడా ఉపయోగించాడని సీటీడీ పేర్కొంది. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయమై లాహోర్‌లో నమోదైన కేసు ఆధారంగా పక్కా ప్రణాళికతో లఖ్వీని పట్టుకున్నామని పాక్ పోలీసులు వెల్లడించారు.

కాగా ముంబై దాడుల కేసుల్లో లఖ్వీయే ప్రధాన సూత్రధారి. 2008 నవంబర్ 26 నుంచి నవంబర్ 29 వరకు దేశ వాణిజ్య రాజధానిలోని ఎనిమిది ప్రాంతాల్లో ఉగ్రవాదులు వరుస బాంబు దాడులు, కాల్పులకు తెగబడ్డారు.

ఈ మారణకాండలో 173 మంది ప్రాణాలు కోల్పోగా, 308 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి కేసులో అరెస్టయిన లఖ్వీ 2015 నుంచి బెయిల్‌పై ఉన్నాడు.

click me!