
swastika symbol-Guntur man jailed: ఒక తెలుగు వ్యక్తి తాను నివాసముంటున్న ఫ్లాట్ తలుపుపై హిందూ మతంలో శుభసూచకంగా భావించే స్వస్తిక్ గుర్తు చేయించుకున్నందుకు జైలుపాలయ్యాడు. ఈ విచిత్ర ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. ఈ గుర్తు నేపథ్యంలోనే తనకు ప్రాణహానీ ఉందని సౌదీ వ్యక్తి ఫిర్యాదులో తెలుగు వ్యక్తి అరెస్టు అయ్యాడు. స్వస్తిత్ సింబల్ ను తప్పుగా భావించడం వల్లే ఈ ఘటన జరిగినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
మీడియా రిపోర్టుల వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి తన ఫ్లాట్ తలుపుపై స్వస్తిక్ గుర్తును ముద్రించడంతో సౌదీ జైలు పాలయ్యాడు. స్వస్తిక్ గుర్తును నాజీ చిహ్నంగా తప్పుగా భావించిన స్థానిక అరబ్బు కెమికల్ ఇంజనీర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంటూరు వ్యక్తి నుంచి తనకు ప్రాణహాని ఉందని సౌదీ వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తెలుగు ఇంజనీర్ ఏడాది కాలంగా సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని కుటుంబం పక్షం రోజుల క్రితం అక్కడికి వెళ్లింది. దీంతో కొత్త ఫ్లాట్ తలుపులపై శుభ సూచకంగా ఉండే స్వస్తిక్ చిహ్నం వేయించుకున్నారు. ఈ చిహ్నం ఇరుగుపొరుగు వారి దృష్టిని ఆకర్షించింది.
ఒక వ్యక్తి దానిని నాజీ గుర్తుగా భావించాడు. అయితే, ఈ గుర్తు దేనిని సూచిస్తుందో వివరిస్తూ సౌదీ వ్యక్తిని ఒప్పించేందుకు తెలుగు కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడంతో కెమికల్ ఇంజనీర్ ను జైలుకు పంపారు. ఎన్నారై కార్యకర్త, ఏపీఎన్ఆర్టీఎస్ కోఆర్డినేటర్ ముజమ్మిల్ షేక్ మాట్లాడుతూ గుంటూరు వ్యక్తిని కలిసేందుకు శుక్రవారం రియాద్ నుంచి ఖోబార్ వరకు దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిపారు. 'సాంస్కృతిక అపోహలే అరెస్టుకు దారితీశాయి. భారతదేశంలో ఈ చిహ్నాన్ని ఎలా ఆరాధిస్తారు, ఇళ్లు, కార్యాలయాలు మొదలైన వాటిపై ఎలా పెట్టుకుంటారు అనే దాని గురించి మేము అధికారులకు వివరించాము. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో సోమవారం జైలు నుంచి విడుదల కానున్నారని తెలిపారు.
సౌదీలో భారతీయ సమాజం కోసం పనిచేస్తున్న కేరళకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త నాస్ షౌకత్ అలీ (నాస్ వక్కం అని పిలుస్తారు) కూడా గుంటూరు వ్యక్తి విడుదలకు సహకరిస్తున్నారని ముజమ్మిల్ షేక్ చెప్పారు. కాగా, స్వస్తిక్ అనేది హిందూ మతంలో ఒక పవిత్ర చిహ్నం. అయితే, నాజీ చిహ్నం తెలుపు వలయంపై 45 డిగ్రీల కోణంలో వంగి ఉన్న నలుపు స్వస్తిక్ చిహ్నాన్ని కలిగి ఉండగా, స్వస్తికాలో కుడి కోణాల్లో చేతులు వంచి చతురస్రాకారంలో ఉండే సమబాహు శిలువ ఉంటుంది. స్వస్తిక్ చిహ్నాన్ని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ మతాలు ఉపయోగిస్తున్నాయి. ఇది సామరస్యం, శుభం, అదృష్టాన్ని సూచించడానికి ఉపయోగించబడుతుంది.. కానీ, నాజీ చిహ్నం ద్వేషం, మారణహోమం మొదలైన వాటితో సంబంధం కలిగి ఉంటుంది.