850 ఏళ్ల నాటి చర్చి అగ్నికి ఆహుతి: దు:ఖసాగరంలో ఫ్రెంచ్ ప్రజలు

By Siva KodatiFirst Published Apr 16, 2019, 1:11 PM IST
Highlights

పారిస్‌లోని 850 ఏళ్ల నాటి ప్రఖ్యాత నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 12వ శతాబ్ధానికి చెందిన ఈ చర్చిలో సోమవారం సాయంత్రం ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయి

పారిస్‌లోని 850 ఏళ్ల నాటి ప్రఖ్యాత నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 12వ శతాబ్ధానికి చెందిన ఈ చర్చిలో సోమవారం సాయంత్రం ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో చర్చి భవనంలో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్ని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సమీప ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి తరలించారు.

ఈ ప్రమాదంలో చర్చి పైకప్పు పూర్తిగా ధ్వంసమవ్వగా.. 93 మీటర్ల శిఖరం పూర్తిగా కూలిపోయింది. అయితే వెంటనే స్పందించిన సిబ్బంది ఇతర కళాఖండాలు, చారిత్రక చిహ్నాలను భద్రపరిచారు.

సుమారు 400 మంది సిబ్బంది కొన్ని గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ఘటనతో దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందన్నారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చే వరకు అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తూనే ఉంటారని మేక్రాన్ తెలిపారు. దేశ ప్రజలతో విడదీయరాని అనుబంధమున్న నోట్రే డామే కేథడ్రల్‌ను పునర్‌నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.

మరో వైపు 850 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చర్చితో ఫ్రాన్స్ ప్రజలది విడదీయరాని అనుబంధం. ఆనాటి ఫ్రెంచి నిర్మాణ శైలికి దీనిని తార్కాణంగా చెబుతుంటారు. ఫ్రెంచి విప్లవం, స్వాతంత్ర్య పోరాటం వంటి పలు చారిత్రక ఘట్టాలకు నోట్రే డామే కేథడ్రల్ సాక్షిగా నిలిచింది. 

click me!