ఆస్ట్రేలియా కాన్‌బెర్రా ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం.. విమానాశ్రయాన్ని ఖాళీ చేయించిన అధికారులు

By Sumanth KanukulaFirst Published Aug 14, 2022, 11:21 AM IST
Highlights

ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా విమానాశ్రయంలో కాల్పుల మోత మోగింది. ఓ ముష్కరుడు చెక్-ఇన్ ప్రాంతంలో ఐదు రౌండ్ల బుల్లెట్లను కాల్చాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌ను ఖాళీ చేయించారు.

ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా విమానాశ్రయంలో కాల్పుల మోత మోగింది. ఓ ముష్కరుడు చెక్-ఇన్ ప్రాంతంలో ఐదు రౌండ్ల బుల్లెట్లను కాల్చాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌ను ఖాళీ చేయించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ఎయిర్‌పోర్ట్‌లోని ప్రధాన టెర్మినల్ భవనంలోని భద్రతా తనిఖీ కేంద్రం వెలుపల స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు తుపాకీ కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని.. తుపాకీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించామని.. ఈ ఘటనకు ఒక్కరే కారణమని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికైనా గాయపడ్డారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

ఎయిర్‌పోర్టులో కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. భయంతో పరుగులు తీశారు. కాల్పుల ఘటనతో తీవ్ర భయాందోళన చెందినట్టుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. ఈ ఘటన అనంతరం అధికారులు ఒక వ్యక్తి చేతికి సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాల్పుల ఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. ప్రజలు విమానాశ్రయానికి రావద్దని అధికారులు సూచించారు. ఎయిర్‌పోర్ట్ వెలుపల భద్రతను కట్టుదిట్టడం చేశారు. అక్కడికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. 


 

click me!