Kota Bommali ps review: `కోట బొమ్మాళి పీఎస్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Nov 24, 2023, 3:37 PM IST

శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన `కోటబొమ్మాళి పీఎస్‌` మూవీ నేడు విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

శ్రీకాంత్‌.. ఫ్యామిలీ హీరోగా అనేక చిత్రాలు చేశారు. ఆయన ఫ్యామిలీ స్టార్‌గా పేరుతెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నారు. బలమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన `కోటబొమ్మాళి పీఎస్‌` అనే చిత్రంలో నటించారు. యంగ్‌ హీరో రాహుల్‌ విజయ్‌, హీరోయిన్‌ శివానీ, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మురళీ శర్మ, బెనర్జీ, పవన్‌ తేజ్‌ ఇతర పాత్రల్లో నటించారు. `జోహార్‌` ఫేమ్‌ తేజ మార్ని దర్శకత్వంలో బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. నేడు శుక్రవారం(నవంబర్‌ 24)న ఈ మూవీ విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
టెక్కలి నియోజకవర్గంలో బై ఎలక్షన్ల వేడి నడుస్తుంటుంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు హోంమంత్రి(మురళీశర్మ). కోట బొమ్మాళి పీఎస్‌ లో రామకృష్ణ (శ్రీకాంత్‌) హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. అతను కుంబింగ్‌, ఎన్ కౌంటర్‌ స్పెషలిస్ట్ కూడా. ఆ స్టేషన్‌లో కుమారి(శివానీ రాజశేఖర్‌) లేడీ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటుంది. రవికుమార్‌(రాహుల్‌ విజయ్‌) అప్పుడే కొత్తగా కానిస్టేబుల్‌గా జాబ్‌లో చేరతాడు. పోలీస్‌ స్టేషన్‌లో చిన్న గొడవలో రామకృష్ణ, రవికుమార్‌.. ఓ పొలిటికల్‌ అండా ఉన్న వ్యక్తితో గొడవపడతారు. ఆ తర్వాత ఓ రోజు రాత్రి పార్టీకి వెళ్లి వస్తుండగా రామకృష్ణ, రవి, కుమారి ప్రయాణిస్తున్న పోలీస్‌ జీపు ఓ యాక్సిడెంట్ కి కారణమవుతుంది. ఆ ప్రమాదంలో స్థానిక నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి(విష్ణు) మరణిస్తాడు. కారణమైన పోలీస్‌లను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌ పెరుగుతుంది. దీంతో ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. తాము దొరికిపోతే కష్టమని చెప్పి రామకృష్ణ, రవికుమార్‌, కుమారి పారిపోతారు. 24గంటల్లో వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తామని హోంమంత్రి మీడియా ముందు ఛాలెంజ్‌ విసురుతారు. వారిని పట్టుకునేందుకు ఎన్‌ కౌంటర్‌ స్పెషలిస్ట్, స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రియాజ్‌ అలీ(వరలక్ష్మి శరత్‌ కుమార్‌) రంగంలోకి దిగుతుంది. మరి ఈ ముగ్గురిని పట్టుకున్నారా? ఆ బలమైన సామాజిక వర్గం.. ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చిందా? ఈ పోలీసులను పట్టుకునేందుకు రియాజ్‌ అలీ ఎలాంటి ప్లాన్స్ వేసింది? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన కథ. 


విశ్లేషణః
మలయాళంలో సక్సెస్‌ అయిన `నాయట్టు` అనే సినిమాకిది రీమేక్‌. తెలుగుకి తగ్గట్టుగా మార్పులు చేశారు. అయితే ఇటీవల కాలంలో రీమేక్‌ చిత్రాలు అంతగా ఆడటం లేదు. ఓటీటీలో వస్తుండటంతో ఆడియెన్స్‌ ఆల్‌రెడీ చూస్తున్నారు, రీమేక్‌లపై ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో `కోటబొమ్మాళి పీఎస్‌`తో ఓ సాహసమే చేశారని చెప్పొచ్చు. అయితే మాతృక పెద్దగా పాపులర్‌ కాకపోవడంతో తెలుగులో కలిసొచ్చే అంశం. ఇక ఈ మూవీ క్రైమ్‌ ప్రధానంగా సాగే పొలిటికల్‌ థ్రిల్లర్. పోలీసులను, చట్టాలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు, వారి అధికారం కోసం అధికారులను, ముఖ్యంగా పోలీసులను ఎలా పావుగా వాడుకుంటారనే దానికి ఈ మూవీ నిదర్శనం. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికల వేడి ఉన్న తరుణంలో ఇలాంటి సినిమా దానికి యాప్ట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఓట్ల కోసం నోట్ల కష్టాలు, అధికారం కోసం ప్రభుత్వాలు ఎలాంటి ప్లాన్స్ వేస్తాయి, జనాలను కులాల పేరుతో ఎలా వాడుకుంటాయనే దానికి ఈ సినిమా నిదర్శనంగా నిలుస్తుంది. 

సినిమా ఆద్యంతం రేసీగా సాగుతుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం పడే పాట్లు, ఎలక్షన్ల సమయంలో పోలీసులు పడే పాట్లని ఇందులో చూపించారు. వాటిని చాలా రియలిస్టిక్‌గా తీయడంతో ఆయా సన్నివేశాలు బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే ఎక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గాల కోసం రాజకీయ పార్టీలు వేసే ఎరలు వంటివి ఆకట్టుకుంటాయి. ఆ సామాజిక వర్గానికి చెందిన కుర్రాడు యాక్సిడెంట్‌గా చనిపోతారు. అందుకు పోలీసుల జీపు కారణం అవుతుంది. అయితే ఆ సమయంలో పోలీసులు తాగిఉండటంతో ఆ కేసు వీరిపై పడుతుందనేది మెయిన్‌ రీజన్‌. దాన్నుంచి తప్పించుకోవడానికి శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ పారిపోతారు. వారిని పట్టుకునే పోలీస్‌ ఆఫీసర్‌ వరలక్ష్మి రంగంలోకి దిగి ఎత్తులకు పై ఎత్తులు వేయడం, దాన్ని శ్రీకాంత్‌ చిత్తు చేయడం అంతా రేసీగా ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇంటర్వెల్‌ వరకు సినిమా పరుగులు పెడుతుంది. ఆ తర్వాత సెకండాఫ్‌లో పారిపోవడం, పట్టుకోవడమనేది స్లోగా మారిపోతుంది. కాస్త బోర్‌ తెప్పిస్తుంది. చాలా సీన్లు లాగినట్టు అనిపిస్తుంది. 
 

సినిమాగా థ్రిల్లింగ్‌ సీన్లు బాగున్నాయి. వచ్చే మలుపులు బాగున్నాయి. ఆకట్టుకునేలా ఉన్నాయి. దీనికితోడు బీజీఎం బాగా హెల్ప్ అయ్యింది. మామూలు సీన్లు కూడా బాగా వర్కౌట్‌ అయ్యాయి. ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేశాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ చివరికి వరకు మెయిన్‌టేన్‌ చేయడం విశేషం. ఆ విషయంలో సినిమా బాగుంది. కానీ ఇందులో అనేక లాజిక్‌కి అందని ప్రశ్నలున్నాయి. ఆ కేసులో పోలీసులను సస్పెండ్‌ చేయమనేది మెయిన్‌ మోటో. కానీ వీరు పరిగెత్తడం, పోలీసులు పట్టుకోవడం చూస్తుంటే దొరికితే కాల్చి చంపేస్తారనేంతగా సీన్‌ క్రియేట్‌ కావడం కన్విన్సింగ్ గా లేదు. జస్ట్ సస్పెన్స్ చేస్తారనే పాయింట్‌ కోసం ఇంత పరిగెత్తాలా? అనేది ఊహకందని విషయం. పైగా తప్పించుకోవడంలో వారి మోటో ఏంటి? అనేది అర్థం కాదు. చివరికి ఫ్యామిలీ పరమైన అవమానంతో శ్రీకాంత్‌ చేసిన పని కన్విన్సింగ్గా ఉండొచ్చు, కానీ ఆయన దాని ద్వారా ఏం చెప్పాలనుకుందనేది క్లారిటీ లేదు. ఇక మురళీ శర్మ రాజకీయాలు, ఓటర్లు, పోలీసు వ్యవస్థ గురించి చివర్లో చెప్పిన డైలాగ్ లు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఆకట్టుకుంటాయి. అదే సమయంలో చివర్లో శ్రీకాంత్‌ ఇచ్చిన ట్విస్ట్ వాహ్‌ అనేలా ఉంటుంది. 
 

నటీనటులుః 
హెడ్‌ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్రలో శ్రీకాంత్‌ అదరగొట్టాడు. సినిమాకి ఆయనే హీరో. హీరోగా సినిమాలు మానేసి క్యారెక్టర్‌ రోల్స్ టర్న్ తీసుకున్న సమయంలో ఆయనకు మరో గుర్తిండిపోయే పాత్ర పడింది. ఆయన సినిమాని నడిపించగలడనే నమ్మకాన్ని తెచ్చే మూవీ పడింది. ఆయన అద్బుత నటనతో మెప్పించారు. ఇక కానిస్టేబుళ్లుగా రాహుల్‌ విజయ్‌, శివానీలు సైతం బాగా చేశారు. పాత్రలో జీవించారు. శివాజీ పాత్ర సైతం ఆకట్టుకుంటుంది. ఇక హోంమంత్రిగా మురళీ శర్మ చేసుకుంటూ వెళ్లాడు. పోలీస్‌ ఆఫీసర్‌గా వరలక్ష్మి మరో మంచి రోల్‌తో అదరగొట్టారు. సినిమాకి నటీనటులు బలం అని చెప్పొచ్చు. 
 

టెక్నీకల్‌గాః 
`కోట బొమ్మాళి పీఎస్‌` మూవీకి టెక్నీషియన్లు మరో అసెట్‌. మ్యూజిక్‌ అదిరిపోయింది. ఇలాంటి క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలకు ఉండాల్సిన బీజీఎం ప్రధానం. రంజిన్‌ రాజ్‌ అదరగొట్టాడు. ఆర్‌ఆర్‌ఆర్‌, `లింగిడి లింగిడి` సాంగ్‌ బాగుంది. కొరియోగ్రఫీ సైతం బాగుంది. ఆర్‌ఆర్‌ సినిమా మరింతగా పరిగెత్తించింది. హైలైట్‌గా నిలిచింది. జగదీష్‌ చీకటి కెమెరా వర్క్ బాగుంది. చాలా వరకు రాత్రిళ్లు సినిమా సాగుతుంది. ఆ లైటింగ్‌, ఫ్రేమ్‌ వర్క్  బాగుంది. ల్యాగ్‌ సీన్ల విషయంలో ఎడిటర్‌ కొంత కేర్‌ తీసుకోవాల్సింది. ఇక దర్శకత్వం సినిమాకి ప్రధాన బలం. కొన్ని లాజిక్కులు పక్కన పెడితే దర్శకుడు తేజ మార్ని సినిమాని బాగా డీల్‌ చేశాడు. ఎంగేజింగ్‌గా తెరకెక్కించాడు. అదే సమయంలో ప్రస్తుతం సమాజంలోని వాస్తవాలను కళ్లకి కట్టినట్టు చూపించాడు. కొన్ని బోరింగ్‌ సీన్లు మినహాయిస్తే సినిమాని ఆద్యంతం రక్తికట్టించాడు దర్శకుడు. అదే సమయంలో అనేక లాజిక్‌లు, ల్యాంగింగ్‌ విషయంలో మరికాస్త కేర్‌ తీసుకోవాల్సింది. కథగా సినిమా అంతిమ లక్ష్యం విషయంలోనూ క్లారిటీ మిస్‌ అయినట్టు అనిపిస్తుంది. అంతిమంగా ఓటర్లు ఎలా ఉంటారు? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అని చెబుతూనే పోలీసు వ్యవస్థ వారి చేతుల్లో బలిపశువులు అని చెప్పడం వాస్తవానికి అద్దం పడుతుంది.

ఫైనల్‌గాః ప్రస్తుత రాజకీయలను ప్రతిబింబించే ఎంగేజింగ్‌ క్రైమ్‌ పొలిటికల్ థ్రిల్లర్‌. 

రేటింగ్‌ః 2.75
 

Latest Videos

click me!