
మాయాబజార్ తెలుగు తమిళ భాషలలో 1957 మార్చి 27న విడుదలైన ఒక పౌరాణిక, ఇతిహాస చిత్రం. కే.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇది కేవలం పౌరాణిక కథల ఆధారంగా తీసిన చిత్రం మాత్రమే కాదు, ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే ఓ మాయాజాలం కూడా. దర్శకుడు కె.వి.రెడ్డి కల్పితంగా తీర్చిదిద్దిన "శశిరేఖా పరిణయం" కథే ఈ సినిమాకు ఆధారం. మహాభారతంలో అసలు శశిరేఖ అనే పాత్ర ఉండకపోయినా, ఈ సినిమా ఆ పాత్రను సృష్టించి, ప్రేక్షకుల్లో శాశ్వత స్థానం కలిగించింది. కొన్ని తరాలపాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీవారిని కూడా అలరించదగిన సినిమా యాయాబజార్. ఈ సినిమా గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. తెలుగు సినిమా గౌరవాన్ని, ప్రతిష్టను నిలబెట్టిన సినిమా ఇది. ఇక మాయాబజార్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
మయాబజార్ సినిమా ఒక మల్టీ స్టారర్ మూవీ. ప్రతీ పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకున్నారు కే.వి.రెడ్డి. అసలు ఈ సినిమాలో ఇంత మంది హీరోలు ఉన్నారు. అందులో మాయాబజార్ కు అసలు హీరో ఎవరు అనేది ప్రతీ ఒక్కరికి కలిగిన సందేహం. ఈసినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, గుమ్ముడి, సూర్యకాంతం, ఛాయాదేవి, మక్కమాల, నాగభూషణం,ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి దిగ్గజాలు నటించారు. అంతే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఇంత మంది భారీ తారగణం నటించిన అతితక్కువ సినిమాల్లో మాయాబజార్ కూడా ఓకటి. ఇంత మంది స్టార్స్ ను ఒక సినిమాలో మెయింటేన్ చేయడం అంటే సమాన్యమైన విషయం కాదు. ఎవరి ఈగోలు దెబ్బతినకుండా. ఇంత పెద్ద సినిమాను అంత మంది స్టార్స్ తో కలిసి సక్సెస్ ఫుల్ గా తీయ్యగలిగారు దర్శకుడు కె.వి రెడ్డి. అందుకే ఈ సినిమా చరిత్రలో ఒక అద్భుత దృశ్యకావ్యంగా నిలిచిపోయింది.
మాయాబజార్ మహాభారతంలో కొన్ని పాయింట్లు తీసుకుని అల్లిన కథ. అభిమన్యుడు, శశిరేఖ పరిణయం చుట్టు అల్లుకుని ఈసినిమా నడుస్తుంది. భారతంలో లేని శశిరేఖ ను సృష్టించి ఈకథను రాసుకున్నారు కే.వి రెడ్డి. ఇక చిన్నతనం నుంచి అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, బలరాముడి కూతురు శశిరేఖ ప్రేమించుకుంటారు. పాండవుల వైభవం చూసిన బలరాముడి భార్య ముందు నుంచి ఈ పెళ్లికి సుముఖంగానే ఉంటుంది. కాని ఆతరువాత పాండవులు జూదంలో ఓడిపోవడం, సుభద్ర తన కుమారుడు అభిమన్యుడిని తీసుకుని పుట్టింటికి రావడంతో, అక్కడ వారికి అవమానాలు ఎదురవుతాయి. దాంతో శశిరేఖను బలరాముడి ప్రియ శిష్యుడైన దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు. ఈ అవమానం భరించలేక సుభద్ర,అభిమన్యులు బయటు వెళ్లిపోతారు. వారు కొన్ని పరిణామాల మధ్య ఘటోత్కచుడి ఆశ్రమానికి చేరతారు. అక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఘటోత్కచుడు కౌరవులను ఒక ఆట ఆడుకుంటాడు. కృష్ణుడి సపోర్టుతో ఘటోత్కచుడు చేసిన పనులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. చివరకు వారు ఏం చేశారు, కౌరవులకు ఎలా బుద్ది చెప్పారు, శశిరేఖతో అభిమన్యుడి పెళ్లి జరిగిందా లేదా అనేది కథ.
నిజానికి ఈ సినిమా చాలా వరకూ కల్పితం. అభిమాన్యుడు చిన్న వయస్సులో మరణిస్తాడు. అయితే ఆయన పెళ్లి చేసుకుంటాడు కానీ.. ఆ పెళ్లి విరాటరాజు కూతురితో జురుగుతుంది. ఇక శశిరేఖా పరిణయం అనేది ఓ కల్పితం. కానీ ఈ టైటిల్ చుట్టు అల్లిన కథ అద్భుతంగా పనిచేసింది. మంచి సినిమాను ఆడియన్స్ కు అందించింది. ఈసినిమాలో ప్రతీ పాత్ర అద్భుతమే అని చెప్పాలి. ఘటోత్కచుడుగా ఎస్వీఆర్ నటన అయితే చెప్పనక్కర్లేదు. ఆయన ఈసినిమాకు ప్రాణం పోశారు. ఈ పాత్ర ఎంటర్ అయిన తరువాత సినిమా ఇంకా ఎక్కువగా అలరిస్తుంది. అభిమన్యుడిగా ఏఎన్నార్ లవ్ స్టోరీ అప్పటి యువతకు గిలిగింతలు పెట్టించింది. ఇక ఈ కథ అంతటిని నడిపించే కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో అంతా ఒక ఎత్తయితే టెక్నాలజీ లేని రోజుల్లో వారు చూపించిన కొన్ని గ్రాఫిక్స్ మరో ఎత్తు. ఘటోత్కచుడు కూర్చుని ఉండగా లడ్డూలు నోట్లోకి వెళ్ళిపోవడం లాంటి సన్నివేశాలను కెమెరా మాయాజాలంతో సృష్టించారు. అంతే కాదు 60 ఏళ్ల క్రితం వారు ఏ టెక్నిక్ వాడి ఇలా చేశారనేది ఇప్పటికీ అర్ధం కాని విషయమే. మార్కస్ బార్ట్‌లీ విజువల్ ఎఫెక్ట్స్ లేని రోజుల్లో తన కెమెరాతో అద్భుత విజువల్స్‌ను అందించారు. 'వివాహ భోజనంబు' పాటలో లడ్డూలు నేరుగా నోట్లోకి వెళ్ళడం, పాత్రలు తనంతట తానే కదలడం, శశిరేఖ మాయాదర్పణం, సత్యపీటిక వంటి సన్నివేశాలు ఇప్పటికీ అద్భుతంగా గుర్తుకు వస్తాయి.
మాయాబజార్ సినిమాలో ఎవరికి తగ్గ పాత్రలు వారికి ఇచ్చాడు దర్శకుడు కెవి రెడ్డి. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో, ఏఎన్నార్ అభిమన్యుడిగా, సావిత్రి శశిరేఖగా నటించారు. కానీ ఈ ముగ్గురికంటే ఎక్కువగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన పాత్ర ఎస్వీ రంగారావు నటించిన ఘటోత్కచుడు. స్క్రీన్ మీద ఎక్కువ సమయం, కథను ముందుకు నడిపే పాత్ర, కామెడీ, మాయాజాలంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో ఈ సినిమాలో ఘటోత్కచుడు పాత్రను అసలు హీరోలా నిలబెట్టాయి. అయితే ఇక్కడే ఓ చిన్న సన్నివేశం గురించి చెప్పుకోవాలి. ఈసినిమాలో అసలు హీరో ఎవరు అని టాపిక్ ఓ సందర్భంలో వచ్చిందట. ఎన్టీఆర్ ఏమో నేను కృష్ణుడి పాత్ర చేశాను కాబట్టి, నేనే హీరో అన్నారట. కాదు ఈసినిమా శశిరేఖా పరిణయం కదా.. అభిమాన్యుడిగా నేనే హీరోను అన్నారట ఏఎన్నారు. ఇక ఎస్వీఆర్ మాట్లాడుతూ.. ఘటోత్కచుడు పాత్ర లేకపోతే అసలు ఈసినిమానే లేదు. ఇక్కడ హీరోయిజం చూపించింది నా పాత్రే కాబట్టి, నేనే హీరో అన్నారట. చివరకు అందరు ఒక మాటమీదకు వచ్చారట. ఈసినిమాలో అద్భుతంగా నటించి, మాయా శశిరేఖగా ఎన్నో వేరియేషన్స్ చూపించిన సావిత్రి ఈసినిమాకు అసలు హీరో అని వారు తీర్మానించారట సరదాగా.
కానీ ఆడియన్స్ మాత్రం ఈసినిమా అంతా చూసి ఘటోత్కచుడు పాత్ర చేసిన ఎస్వీఆర్ ఈ సినిమాకు అసలు హీరో అన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతే కాదు ఈసినిమా ప్రమోషషన్లు కూడా ఎక్కువగా ఎస్వీఆర్ పేరు మీదే జరిగిందట. ఎందుకంటే 1957లో ఆయన పాపులారిటీ ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ఎక్కువగా ఉండేది. కాబట్టే 'మాయాబజార్'లో అసలైన హీరో ఎవరు అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగింది. ఇక ఎవరి పాత్రల్లో వారు అద్భుతంగా నటించారు. ఒక రకంగా పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి.
ఈ సినిమా కోసం ఎన్నో టైటిల్స్ ను పరిశీలించారు డైరెక్టర్. 'శశిరేఖా పరిణయం', 'ఘటోత్కచుడు' వంటి పేర్లు పరిశీలించినప్పటికీ చివరికి "మాయాబజార్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది కేవలం శశిరేఖా-అభిమన్యుల వివాహాన్ని చూపించే కథ కాదు. కౌరవులను మాయా ప్రపంచంలో నవ్వులపాలుగా చేయడం, వారి కుట్రలను కృష్ణుడు, ఘటోత్కచుడు కలిసి ఎలా ఛేదించారన్నదే కథలో అసలైన లక్ష్యం. మాయాబజార్ అంటే బజార్ తెలుగు పదం కాదు. ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది అవుతుందా అని ,ఒకటికి పదిసార్లు ఆలోచించారట కే. వి రెడ్డి. కాని ఈ టైటిల్ తోనే సినిమా అద్భుతంగా నడిచింది.
మయాబజార్ బడ్జెట్, కలెక్షన్స్
ఈ సినిమాను విజయా ప్రొడక్షన్స్, అప్పట్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. 63 ఏళ్ల క్రితమే ఈమూవీ 2 లక్షల వరకూ బడ్జెట్‌తో ఈసినిమాను నిర్మించారు. ఆ కాలంలో ఇది అత్యంత ఖరీదైన చిత్రం. 1957లో విడుదలైన 'మాయాబజార్' సినిమా తెలుగు వెర్షన్ దాదాపు 2 కోట్ల షేర్‌తో 2 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది, తమిళ డబ్బింగ్ వెర్షన్ సుమారు 50 లక్షలు వసూలు చేసింది. ఇది ఎవరు ఊహించలేని బ్లాక్ బస్టర్ గా చెప్పవచ్చు. 60 ఏళ్ల క్రితం 2 కోట్లు వచ్చాయంటే.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకంటే అప్పుడు మాయాబజార్ ఎక్కువగానే సంపాదించిందని అనుకోవచ్చు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలలో ఒకటిగా మాయాబజార్ నిలిచింది.
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన తొలి చిత్రం మాయాబజార్. ఆ తర్వాత హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి కూడా డబ్ చేశారు. అన్ని భాషల్లోనూ విజయం సాధించింది. ఒక దశలో ఇది మొదటి పాన్ ఇండియా సినిమాగా చెప్పుకోవచ్చు. అంతే కాదు మాయాబజార్ సినిమా 24 కేంద్రాలలో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈసినిమాకి మొదటగా సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకులుగా పనిచేశారు. అప్పుడు 4 డ్యూయెట్ సాంగ్స్ (చూపులు కలసిన శుభవేళా, నీవేనా నను తలచినది, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునది) స్వర కల్పన చేసాక, కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో, సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితుడయ్యాడు. రాజేశ్వరరావు కట్టిన బాణీలకే వాయిద్య సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేసాడు ఘంటసాల. మాయాబజార్ పాటులు ఇప్పటికీఎక్కడో ఒక చోట వనిపిస్తూనే ఉంటాయి. తెలుగు సినిమా పాటలు ఉన్నంత కాలం అవి మోగుతూనే ఉంటాయి. ఇలా మాయాబజార్ తెలుగువారి మనసుల్లో నిలిచిపోయింది. ఆతరువాత కాలంలో ఈసినిమాను కలర్ సొగబులద్ది రీరిలీజ్ కూడా చేశారు.