
ప్రభావతి, సత్యంలను కలిపేందుకు సుశీలమ్మ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఎలాగైనా కోడలితో మాట్లాడమని సత్యంని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. మీనాకి క్షమాపణలు చెప్పమని ప్రభావతిని ఇబ్బంది పెట్టొద్దని సత్యంతో చెబుతుంది. ఆ మాటకు సత్యం కూడా షాక్ అవుతాడు. దానికి ఆమె ‘ప్రభావతి గురించి మనకు ముందు నుంచీ తెలిసిందే కదా. మీనాని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. చులకనగా చూస్తుంది. తన మనసులో మీనా మీద మంచి అభిప్రాయం ఎప్పుడూ లేదు. ఇప్పుడు కొత్తగా క్షమాపణలు చెప్పమని చెబితే.. ఆ కోపం మరింత ఎక్కువ అవుతుంది.దానిని మనసులో పెట్టుకొని మీనాని మరింత ఇబ్బంది పెడుతుంది. ఇదంతా అవసరమా? ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించుకోవాలి. దాని గురించి మరోసారి చర్చలు రాకూడదు’ అని పెద్దావిడ చెబుతుంది. ‘ అంటే ఇప్పుడు ప్రభావతి చేసిన తప్పుకు శిక్ష ఉండకూడదా?’ అని సత్యం అడుగుతాడు. ‘ తప్పదు రా.. కుటుంబం బాగుండాలి అంటే కొన్ని భరించాలి. మన వాళ్లు చేసిన తప్పులు క్షమించాలి. ఇలా మాట్లాడకుండా ఉండిపోతే.. ఒంటరిగా మిగిలిపోయేది నువ్వే.. వచ్చి తనతో మాట్లాడురా’ అని శీలా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది.
కానీ సత్యం మాత్రం ‘ ఏమో అమ్మా.. నా మనసు ఒప్పుకోవడం లేదు..’ అని చెబుతాడు. ‘ ఒరేయ్.. ఇన్ని సంవత్సరాలుగా తనని భరిస్తూ వచ్చావ్.. ఇప్పుడేంటి ఇలా? నేను ఏం చెప్పినా నీ మంచి కోసమే చెబుతాను అని నీకు తెలుసు కదా, నా మాట విని వెళ్లి ప్రభా తో మాట్లాడు’ అని చెబుతుంది. తల్లి మాటలకు సత్యం అంగీకరిస్తాడు. ఇద్దరూ కలిసి కిందకు వెళతారు.
తర్వాత పంచాయతీ హాల్లో మొదలౌతుంది. శీలా.. కోడలు ప్రభావతికి క్లాస్ పీకడం మొదలుపెడుతుంది. ‘ ప్రభా ఏంటిది. నువ్వు ఈ ఇంటి ఇల్లాలు. ఇంటికి ఏదైనా కష్టం వస్తే... అందరితో కూర్చొని పరిష్కరించాలి. అంతేకానీ, మనోజ్ చేసిన తప్పుని కవర్ చేయడానికి నువ్వు ఇంకో తప్పు చేసి.. ఇంట్లో అందరి ముందు అవమానాలు పడటం ఏమైనా బాగుందా?’ అని సీరియస్ గా అడుగుతుంది. ‘ బాగుండదు అత్తయ్య’ అని ప్రభావతి సమాధానం ఇస్తుంది. ‘ ముఖ్యంగా నీ భర్తకు తెలియకుండా నువ్వు ఏ పని చేయకూడదు, మంచైనా, చెడు అయినా అన్నీ వాడికి తెలిసే జరగాలి’ అని సలహా స్తుంది.
దానికి ప్రభావతి.. ‘ నేను ఏమీ కావాలని చేయలేదు అత్తయ్య, మనోజ్ గాడు మోసపోయి, రోహిణికి దొరికిపోయి వాళ్లిద్దరి మధ్య సమస్యలు వస్తాయని, నాగలు తాకట్టు పెట్టుకోమని ఇచ్చాను. కానీ, వాడు ఆ నగలు అమ్మేసిన తర్వాత వచ్చిచెప్పాడు. అయినా.. నేను వాడిని క్షమించలేదు.. రోజూ ఆ నగలు తెచ్చి ఇవ్వమని అడుగుతూనే ఉన్నాను’ అని చెబుతుంది.
అత్త మాటలకు కోడలు రోహిణి కూడా వంత పాడుతుంది. ‘ అవును అమ్మమ్మ.. ఇందులో తప్పు మనోజ్ దే ఉంది. అత్తయ్యకు ఏమీ తెలీదు’ అని కవర్ చేయాలని చూస్తుంది. కానీ.. శీలా ఊరుకోదు.. రోహిణికి కూడా కాస్త గడ్డి పెడుతుంది. తర్వాత.. జరిగింది ఏదో జరిగిందని.. కొడుకు, కోడలిని మాట్లాడుకోమని సలహా ఇస్తుంది.
దానికి సత్యం... ‘ మా గురించి వదిలేయమ్మా.. నాకు కోపం వచ్చింది ఎక్కడంటే... ఆ నగలు ఇచ్చింది అదే,వాడుఅమ్ముకున్నాడు అని కూడా తెలుసు. అయినా కూడా ఆ నగల నింద మీనా మీద, నీ మీద వేసింది. అందుకే.. నీకు, మీనా కి క్షమాపణలు చెప్పమని చెప్పు’ అని తేల్చిచెబుతాడు
‘ మీరు నా అత్తగారు కాబట్టి... మీకు క్షమాపణలు చెబుతాను.. దానికి మాత్రం చెప్పను’ అని ప్రభావతి పొగరుగా సమాధానం ఇస్తుంది. అయితే.. ‘ నాకు ఎలాంటి క్షమాపణలు అవసరం లేదు. మీనా కూడా నీ నుంచి సారీ కోరుకోదు. అయినా కోడళ్ల ముందు నా కోడలి పరువు నేను ఎలా తీస్తాను? ఏం అవసరం లేదు.. నేను వచ్చింది మీ ఇద్దరి మధ్య సమస్యలు తీర్చడానికి’ అని శీలా చెబుతుంది. అయితే... వీళ్లు ఇలా అయితే మాట్లాడుకోరని.. ఇద్దరినీ గదిలోకి పంపి తాళం వేద్దాం అని బాలు ఐడియా ఇస్తాడు. అందుకు.. అందరూ ఒకే అనడంతో.. బలవంతంగా ఇద్దరినీ లోపలికి పంపి బయట గడియ పెడతాడు. అయితే.. ఆ సీన్ చూసి.. ఫస్ట్ నైట్ కి పంపినట్లు ఉంది అని శ్రుతి నోరు జారుతుంది.
ఇక లోపలికి వెళ్లిన తర్వాత క్షమాపణలు చెప్పకుండా ప్రభావతి సిగ్గు పడుతూ ఉంటుంది. ఈ లోగా.. సత్యం కి పొలమారి దగ్గు వస్తుంది. ప్రభావతి వెంటనే మంచి నీళ్లు ఇస్తుంది. కానీ, అవి తీసుకోకుండా సత్యం విసుక్కుంటాడు. వీళ్ల గది నుంచి మాటలు రావడం లేదని.. బాలు ఫ్యామిలీ అందరూ వెళ్లి తలుపు తీసి చూస్తారు. వాళ్లిద్దరూ తూర్పు, పడమరలా నిలపడి ఉంటారు. దీంతో... బాలు కాసేపు దాని మీద పాటలు పాడతాడు. ఆ సీన్ ఫన్నీగా ఉంటుంది. ఇలా అయితే కుదరదని.. ఇద్దరినీ బయటకు తీసుకువస్తుంది.
‘ నేను ఏం చెప్పాను.. మీరు ఏం చేస్తున్నారు?’ అని శీలా అడుగుతుంది. ‘ నేను మాట్లాడాను అత్తయ్య.. కానీ ఆయన కసురుకున్నారు’ అని ప్రభావతి చెబుతుంది. ‘ఛీ.. ఆ మొహం చూడాలంటేనే కంపరంగా ఉంది.. ఇంక మాట్లాడాలా?’ అని సత్యం తన అయిష్టాన్ని చూపిస్తాడు. ఈ లోగా రోహిణీ అందుకుంటుంది. ‘ మనోజ్.. ఇదంతా నీ తప్పే... అత్తయ్య తప్పు ఏమీ లేదని నీకు మాత్రమే తెలుసు. నువ్వు సారీ చెప్పు’ అని అంటుంది. దానికి మనోజ్... ‘ అవును నాన్న.. అమ్మ కేవలం తాకట్టు పెట్టుకోమని మాత్రమే ఇచ్చింది.. నేనే తాకట్టు పెడితే డబ్బులు సరిపోవని.. అమ్మేశాను, పాపం అమ్మ తప్పేమీ లేదు నాన్న’ అని చెబుతాడు.
దానికి శీలా.. నాన్న మనోజ్ ఇటు రా నాన్న అని పిలిచి చెంపలు వాయిస్తుంది. కొడుకును కొట్టడంతో ప్రభావతి బాధపడుతంటే.. నీకు కూడా కావాలా అని అనడంతో నోరు మూస్తుంది. ఆ సీన్ కి బాలు చప్పట్లు కొడతాడు. తర్వాత మనోజ్ ని తిట్టిపోస్తుంది. మనోజ్ అలా పెరగడానికి కారణం ప్రభావతి అని.. ఆమెకు కూడా క్లాస్ పీకుతుంది. తర్వాత.. కోడలికి కాకపోయినా... కనీసం తన కొడుక్కి క్షమాపణలు చెప్పమని శీలా సలహా ఇస్తుంది.
దీంతో ప్రభావతి ఏడ్చుకుంటూ... ‘ వాడి మీద ప్రేమతోనే చేశాను.. క్షమించండి’ అని అడుగుతుంది. తల్లి బలవంతం మీద సత్యం కూడా క్షమించాను అని ఒప్పుకుంటాడు. ఇంట్లో అందరూ సంతోషిస్తారు. అయితే... ప్రభావతి ఇంకా ఏడుస్తూనే ఉండటంతో... తల్లి కన్నీళ్లు తుడిచి ఏడ్వద్దని బాలు చెబుతాడు. అది కూడా ఫన్నీగా ఉంటుంది. రివర్స్ లో ఆమె బాలుని కూడా తిట్టడంతో... ఇప్పుడు మా అమ్మవి అనిపించుకున్నావ్.. గయ్యాళి గంపావతి అని బాలు అంటాడు. ఆ మాటకు ఇంట్లో అందరూ నవ్వేస్తారు.
తర్వాత.. శీలా మాట్లాడుతూ.. ‘ ఒరేయ్ మనోజ్.. ఇంట్లో చాలా సమస్యలకు నువ్వే కారణం. ఇక నుంచి అయినా బుద్ధి గా ఉండరా’ అని సలహా ఇస్తుంది. ‘ దాన్ని అన్నయ్య ఒక కోర్సులా చదవాలి బామ్మ’ అని రవి అంటే.. దాని కోసం మీ అన్నయ్య ఇంకో 4 లక్షలు మింగుతాడు అని శీలా సరదాగా అంటుంది. ఆ మాటలకు మనోజ్ భిక్కమొహం వేస్తాడు.
అయితే... ‘ వాడు మింగిన లక్షలు అన్నీ మాకు తెచ్చి ఇవ్వాలి.. అప్పుడే బుద్ధి వస్తుంది’ అని బాలు అంటాడు. కానీ.. ‘ అంత డబ్బు ఒకేసారి ఎలా ఇస్తాడు?’ అని శీలా అడుగుతుంది. ‘ దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది.. నెలకు రూ.50 వేలు ఇస్తే చాలు’ అని బాలు సలహా ఇస్తాడు. ‘ ఈ ఐడియా చాలా బాగుంది.. రోహిణీ కూడా పార్లర్ ఉంది కాబట్టి.. ఇద్దరూ కలిసి తీర్చాల్సిందే’ అని శ్రుతి కూడా అంటుంది. అయితే... తనకు సంబంధం లేదని రోహిణీ చేతులు ఎత్తేస్తుంది. దీంతో... ఈ బాధ్యత ప్రభావతి తల మీద పడుతుంది. ఇక ప్రభావతికి కూడా తప్పదు... ‘ విన్నావ్ గా.. నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది. నెల నెలా రూ.50 వేలు ఇవ్వాల్సిందే’ అని ప్రభావతి మనోజ్ తో అంటుంది. అయితే... మనోజ్ సమాధానం చెప్పకుండా రోహిణీ వైపు చూస్తూ ఉంటాడు.
దానికి బాలు... ‘ నువ్వు డబ్బులు ఎత్తుకుపోయేటప్పుడు పార్లరమ్మకు చెప్పి ఎత్తుకుపోయావా? నిన్ను ఏమీ ఒక్కసారిగా ఇవ్వమని చెప్పడం లేదు కదా, నెల నెలా ఇస్తానని ఒప్పుకో’ అని బాలు వార్నింగ్ ఇస్తాడు. ప్రభావతి కూడా బలవంతం చేయడంతో.. తప్పక మనోజ్ ఒప్పుకుంటాడు. అయితే.. మధ్యలో శీలా జోక్యంచేసుకొని.. ‘ ఒకే అంటే సరిపోదు.. మనోజ్ నెల నెలా డబ్బులు ఇచ్చేలా చూసుకునే బాధ్యత నీదే..’ అని ప్రభావతి నెత్తిమీద కూడా పెడుతుంది. దానికి ప్రభావతి తప్పక సరే అని ఒప్పుకుంటుంది.
ఇక మనోజ్ ని తన గదిలోకి రోహిణీ తీసుకువెళ్తుంది. ‘ మళ్లీ ఈ రూ.50వేల గోల ఏంటి?’ అని మనోజ్ అంటే... ‘నువ్వే కదా మింగావ్’ అని రోహిణీ అంటుంది. ‘ నువ్వు కూడా నన్నే అంటావా?’ అని మనోజ్ అడుగుతాడు. ‘ నేను కాబట్టి.. గదిలో అడుగుతున్నాను.. అదే శ్రుతి లాంటిది అయితే.. వీధిలో నిలపెట్టి అడిగేది’ అని రోహిణీ బదులిస్తుంది. ‘ ఇదంతా బాలు గాడి ప్లాన్ లా ఉంది.. వాడు కావాలనే బామ్మను ఇక్కడికి పిలిపించాడు’ అని మనోజ్ అంటే... ‘ పిలిపించి మంచి పని చేశాడు.. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు చేయలేని పని బామ్మగారు చేశారు.. అత్తయ్య, మామయ్య కలిశారు’ అని రోహిణీ అంటుంది. ‘ వాళ్లు కలవాలని.. నాకు సమస్య తెచ్చారు.. ఇప్పుడు రూ.50 వేలు ఎక్కడి నుంచి తేవాలి?’ అని మనోజ్ అంటే...‘ మామయ్యకి కూడా ఊరికే రాలేదు... తన జీవితమంతా ధారబోసి సంపాదించారు. వాటిని తీసుకొని నువ్వు బాగుపడి ఉంటే.. ఆ సంతోషం అయినా మిగిలేది. కానీ, ఆ డబ్బు ఎవరికీ లేకుండా కల్పన బొంద కొట్టింది నువ్వే’ అని రోహిణి తిడుతుంది. ‘ కానీ, ఆ డబ్బులు రాబట్టాను కదా’ అని మనోజ్ అంటే.. కానీ రోహిణీ తిడుతుంది. తన కారణంగానే డబ్బులు వచ్చాయని చెబుతుంది. ఇక నుంచి షాప్ ని మంచిగా చూసుకొని.. డబ్బులు తిరిగి ఇవ్వమని చెబుతుంది. ఈ లోగా ప్రభావతి వాళ్ల దగ్గరకు వచ్చి మళ్లీ కొడుకును తిడుతుంది. ఇంత జరిగినా కూడా మీనానే కారణం అని కోపం చూపిస్తుంది. రోహిణీని పొగుడుతుంది. ‘ నీ అదృష్టం కొద్దీ నీకు చాలా మంచి భార్య దొరికింది. కానీ.. నిన్ను మోసం చేసే అమ్మాయి వచ్చి ఉంటే నీ పరిస్థితి ఏంటి?’ అని అంటుంది.. ఆ మాటకు రోహిణి ముఖం మాడిపోతుంది. నిజంగానే రోహిణీ మనోజ్ ని మోసం చేసి పెళ్లి చేసుకోవడం గమనార్హం. అయితే.. ప్రభావతి మాటలకు విసిగిపోయిన మనోజ్... తల్లికి ఎదురు తిరుగుతాడు.. ‘ నువ్వు నన్ను కన్నది.. నేను సంపాదించింది తిని కూర్చోవడానికా?’ అని అడుగుతాడు. ఆ మాటకు ప్రభావతి షాక్ అవుతుంది.