సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి త్వరలో రాబోతున్న చిత్రం 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా ఈ చిత్రంలో సూపర్ స్టార్ కి జోడిగా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన 'కావాలి' అనే సాంగ్ యూట్యూబ్ లో పెను సంచలనంగా మారింది.
Jailer
ఎక్కడ చూసినా తమన్నా స్టెప్పులపై నెటిజన్లు, సెలెబ్రిటీలు రీల్స్ చేస్తున్నారు. అంతగా జనాలకు ఈ సాంగ్ నచ్చేసింది. సినిమాపై హైప్ కి కూడా ఈ సాంగ్ ఉపయోగపడింది. ఈ సాంగ్ లో తమన్నా కంప్లీట్ గ్లామర్ లుక్ లో అదరహో అనిపిస్తోంది. జైలర్ పై బజ్ జోరందుకుంది అనుకున్న తరుణంలో ఊహించని చిక్కు వచ్చిపడింది.
జైలర్ అనే టైటిల్ తోనే మలయాళంలో దర్శకుడు సిక్కిర్ మడతిల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రజనీకాంత్ జైలర్ చిత్రం రిలీజ్ అవుతున్న ఆగష్టు 10నే ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనితో రెండు చిత్రాల టైటిల్ ఒకటే కావడంతో తమ చిత్రం నష్టపోయే అవకాశం ఉందని మలయాళీ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ లో వాపోయింది.
దర్శకుడు మడతిల్ మాట్లాడుతూ.. రజనీకాంత్ జైలర్ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ సంస్థని టైటిల్ మార్చుకోవాలని రిక్వస్ట్ చేశాం. కానీ అందుకు వాళ్ళు నిరాకరించారు. రజనీ జైలర్ వల్ల మేము నష్టపోయే అవకాశం ఉంది. కనీసం మలయాళంలో అయినా రజనీ చిత్ర టైటిల్ మార్చాలని కోరాం అందుకు కూడా వారు అంగీకరించలేదు.
మేము జైలర్ టైటిల్ ని 2021 ఆగష్టు లో కేరళ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశాం. ఆర్థిక సమస్యల వల్ల రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దీనితో టైటిల్ పోస్టర్ ని గత ఏడాది జూన్ లో రిలీజ్ చేసాం. మా కంటే 10 రోజుల ముందు రజని చిత్ర టైటిల్ బయటకి వచ్చింది. కానీ మేము ముందుగానే రిజిస్టర్ చేశాం.
మరోవైపు సన్ పిక్చర్స్ సంస్థ కూడా మలయాళీ జైలర్ పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కి దేశం మొత్తం మార్కెట్ ఉంది కాబట్టి వసూళ్లు దెబ్బ తినకుండా.. ఈ సమస్యపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మలయాళీ జైలర్ లో ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా నటిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ రజని జైలర్ లో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ , రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిలీజ్ కి ఇక నెలరోజుల సమయం కూడా లేదు. దీనితో ఈ టైటిల్ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.