ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో తాను కూడా భాగం అయ్యేలా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'వ్యూహం' చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ జర్నీ ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ చిత్రాలకి వివాదాలు జోడించి ఆసక్తి పెంచడంలో వర్మ స్టయిలే వేరు.
వ్యూహం చిత్రాన్ని ఆర్జీవీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం నవంబర్ 10న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ పై కూడా విమర్శలు ఎదురయ్యాయి. స్పష్టంగా రాంగోపాల్ వర్మ జగన్ ని హైలైట్ చేస్తూ ప్రతిపక్ష నాయకులని కించపరిచే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే విమర్శలు మొదలయ్యాయి.
ఈ చిత్రం రిలీజ్ కాకముందే వివాదాలు మొదలవుతున్నాయి. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ వ్యూహం చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. వ్యూహం రిలీజ్ కాకుండా ఆపేందుకు నట్టికుమార్ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు అందించనున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ సమయంలో ప్రతిపక్షాలని కించపరిచే విధంగా తెరకెక్కించిన వ్యూహం రిలీజ్ మంచిది కాదని నట్టి కుమార్ భావిస్తున్నారు. ఈ మేరకు వ్యూహం చిత్రం పై ఫిర్యాదు చేసేందుకు ఆయన అడ్వకేట్ కేశాపురం సుధాకర్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందించబోతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ చీఫ్ కి, కేంద్ర హోమ్ శాఖకి కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
వైఎస్ జగన్ కి అనుకూలంగా, వైయస్సార్ సీపీ పార్టీకి లాభం చేకూరేలా ఆర్జీవీ వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించారు అని నట్టి కుమార్ అంటున్నారు. ఈ చిత్రంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లని తక్కువ చేసి చూపించేలా వారి పాత్రలకు డూప్ లు క్రియేట్ చేసి జగన్ ని హైలైట్ చేసే ఉద్దేశంతో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నాయకులు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ పాత్రలని కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. త్వరలో తెలంగాణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం విడుదలైతే తప్పకుండా ప్రభావం ఉంటుంది. ఇలాంటి చిత్రాన్ని రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని ఎలక్షన్ కమిషన్ ని కోరుతున్నట్లు నట్టి కుమార్ పేర్కొన్నారు.
వైఎస్సాఆర్ సిపి పార్టీకి చెందిన దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా, ఆ పార్టీ సహకారంతో ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కించారు అని నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు. టిడిపి, జనసేన, కాంగ్రెస్ లాంటి ప్రతిపక్ష పార్టీల నాయకులని వ్యంగ్యంగా చూపించి.. జగన్ పాత్రని హైలైట్ చేస్తూ వైసీపీకి రాజకీయ లబ్ది చేకూర్చే ఉద్దేశంతో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నట్టి కుమార్ తెలిపారు.