కోడలు కన్య కాదని తెలిస్తే.. ఇంప్యూర్ స్టోరీ
`తమకు కాబోయే కోడలు కన్య కాదని తెలుస్తోంది. దీంతో అత్తమామలు ఏం చేశారనే కథాంశంతో రూపొందిన చిత్రమే `ఇంప్యూర్` అని చెప్పింది నిర్మాత, రైటర్ వారాహి మల్లిపామలు. ఆమె ‘ఇంప్యూర్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి నిర్మాతగా, నటిగా, రచయిత్రిగా అరంగేట్రం చేస్తున్నారు. కాకినాడలో పుట్టిన వారాహి పెన్సిల్వేనియాలో పెరిగారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. ఆమె పెన్ స్టేట్ నుండి ఇంజనీరింగ్, జర్నలిజంలో డబుల్ మేజర్ పూర్తి చేశారు. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, లండన్ వంటి నగరాల్లో జీవనోపాధి కోసం ఆమె టెక్ రంగంలో పనిచేశారు. కానీ తన సినిమా కలలను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. ఆమె ఆరు సంవత్సరాల క్రితం, పగలు ఉద్యోగం చేస్తూ, రాత్రులు, వీకెండ్స్‌లో స్క్రిప్ట్ రాస్తూ ఉండేవారు.
'మా ఇంటి బంగారం' సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేసిన నిశాంతి ఎవాని ‘ఇంప్యూర్’తో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఒక మహిళ కన్య కాదని ఆమె అత్తమామలకు తెలియడంతో ఆ పెళ్లిని రద్దు చేసే కథాంశంతో ‘వారాహి’ని తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరచుగా తెలుగు పాత్రలకు ఉత్తర భారత మహిళలనే తీసుకుంటుంది. మహిళా ప్రాధాన్య చిత్రాలను అమ్మడం చాలా కష్టం. అందుకే వారహి ప్రధాన పాత్రలో తెలుగు మహిళ అయిన యషా ముత్తులూరిని తీసుకున్నారు.
ఇక ‘ఇంప్యూర్’ చిత్ర విశేషాల గురించి వారాహి మల్లిపాముల మాట్లాడుతూ..‘నేను ఎన్నో ఏళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉండటం.. దగ్గరకు వచ్చి అవకాశాలు దూరం అవ్వడం వంటి సంఘటనల్ని అమ్మ చూశారు. మా చెల్లి పెళ్లికి మా అమ్మ చాలా ఖర్చు పెట్టారు. అందుకే ఆ డబ్బును సినిమాలో పెట్టాలనుకుంటే ఇస్తానని చెప్పారు. నేను ఆ ప్రతిపాదనను అంగీకరించాను. కానీ ఆ డబ్బుతో ఒక పూర్తి సినిమా తీయలేకపోయాను. మేము ఇంకా చాలా అప్పు చేశాం. నటీనటులు, సాంకేతిక నిపుణులను నియమించుకోవడానికి నేను న్యూయార్క్ నుండి వచ్చాను` అని చెప్పింది.