అవసరాలు తీర్చుకోవాలనే చాలా మందికి ప్రతి నెలా ఫిక్స్ డ్ అమౌంట్ కోరుకుంటారు. చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజర్ల వరకు అందరికీ నికర ఆదాయం అవసరం. అందుకే చిన్న పిల్లలు పోకెట్ మనీ కావాలని కోరుకుంటారు. దాన్ని దాచుకొని వారికి కావాల్సినవి కొనుక్కుంటారు. అలాగే ఇళ్లలో ఉండే హౌస్ వైఫ్‌లు.. ప్రతి రోజూ ఇంటి పని చేసి కష్టపడే వారు చీరలు, నగలు కొనుక్కోవాలని ఆశ పడుతుంటారు. అయితే నికర ఆదాయం లేక భర్త ఇచ్చే డబ్బును దాచి వాటిని కొనుక్కుంటారు. ఇంటి ఖర్చులకు భర్త ఇచ్చే డబ్బులో కొంత ఆదా చేస్తూ వారికి నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు. ఇక సీనియర్ సిటిజన్స్.. వారికి ముఖ్యంగా ఆరోగ్యం అవసరాలు తీర్చుకోవడానికి రెగ్యులర్ ఇన్ కమ్ కోసం ఆరాట పడుతుంటారు. బిడ్డలను డబ్బులు అడగాలంటే ఇబ్బందులు పడుతుంటారు. అలా అని హాస్పిటల్ ఖర్చులు, మందులు లాంటి అవసరాలు ఆపలేరు.
ఇలాంటి వారందరికీ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(POMIS) క్రమం తప్పకుండా ఆదాయం పొందడానికి గొప్ప మార్గం. ముఖ్యంగా పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు ఈ పథకం చాలా ఉపయోగకరం. పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్(POMIS) ఒక సురక్షితమైన, నమ్మకమైన పెట్టుబడి పథకం. ఇది చిన్న పెట్టుబడిదారులకు నెలవారీ స్థిరమైన ఆదాయం పొందేందుకు అనువైన స్కీమ్. ఈ పథకం భారత ప్రభుత్వ పోస్ట్ ఆఫీస్ ద్వారా అమలవుతోంది. ఈ పథకం ద్వారా నెలవారీ ఆదాయం అందుతుంది. వడ్డీ మొత్తం నేరుగా ఖాతాదారుడి బ్యాంకు అకౌంట్ కు జమ అవుతుంది.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(POMIS) కాల పరిమితి 5 సంవత్సరాలు. వడ్డీ రేటు కాలానుగుణంగా మారుతుంది. అయితే ప్రస్తుత రేటు 7.4% గా ఉంది. ఇందులో మినిమం డిపాజిట్ రూ.1,000 పెట్టుబడిగా పెట్టవచ్చు. మాక్సిమం డిపాజిట్ వచ్చేసి వ్యక్తిగత ఖాతా అయితే రూ. 9 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్ ఖాతా అయితే రూ. 15 లక్షలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ లో మాక్సిమం ముగ్గురు జాయిన్ కావచ్చు.
ఈ విధంగా ఫిక్స్‌డ్ అమౌంట్ డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాలు వడ్డీ రేటు 7.4% చొప్పున రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.5,550 వస్తుంది. రూ.15 లక్షలకు రూ.9,250 వస్తుంది.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(POMIS) లో చేరాలంటే భారత పౌరులై ఉండాలి. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల పిల్లలకు కూడా ఈ ఖాతా ఓపెన్ చేయవచ్చు. కానీ వారి పేరుతో తల్లిదండ్రులు గాని గార్డియన్లు గాని ఈ అకౌంట్ నిర్వహించాలి. NRI లు, HUF లు ఈ పథకానికి అర్హులు కాదు.
ఈ స్కీమ్ లో చేరడం వల్ల నెలవారీ ఆదాయం ద్వారా ఖర్చులను తీర్చుకోవచ్చు. ప్రభుత్వ స్కీమ్ కాబట్టి పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ సర్వీసులు సులభంగా ఉపయోగించుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ ను క్లోజ్ చేసి, కొత్తగా పెట్టుబడి పెట్టవచ్చు.
మీరు గాని ఒకవేళ 5 సంవత్సరాల కంటే ముందే పెట్టిన పెట్టుబడిని వెనక్కు తీసుకోవాలంటే కొంత ఫైన్ కట్టాల్సి ఉంటుంది. 1 సంవత్సరం పూర్తయ్యే లోపు పెట్టుబడి వెనక్కు తీసుకోవాలంటే అందుకు అనుమతి లేదు. 1 నుంచి 3 సంవత్సరాల మధ్య తీసుకుంటే 2 % జరిమానా కట్టాలి. 3 సంవత్సరాల తర్వాత తీసుకుంటే 1 % జరిమానా ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్‌లో POMIS ఫారమ్ నింపి, ID ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ సమర్పించండి. డిపాజిట్ మొత్తం నగదు, చెక్ లేదా డీడీ ద్వారా చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు మీ సమీప పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించండి. లేదా భారత ప్రభుత్వ పోస్టల్ వెబ్‌సైట్‌లో వివరాలు చెక్ చేయండి.