మీ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం వల్ల మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది ... అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోడానికి ఈ డబ్బులు ఉపయోగపడతాయి. సాధారణ ప్రజలు తమ పొదుపులను పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన ఎంపికగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకాన్ని ఎంచుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రిటర్న్ పొందవచ్చు. ఇలా ఓ అద్భుతమైన స్కీమ్ ను ఇండియన్ పోస్టాఫిస్ నడుపుతోంది. ప్రతి నెలా కేవలం రూ. 1500 మాత్రమే డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో రూ. 5 లక్షలు పొందవచ్చు. ఇలా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టుబడిపై 7.1% వడ్డీ రేటును అందిస్తుంది. ఇది పోస్టాఫీస్ అధిక వడ్డీ రేటు పథకాలలో ఒకటి.
ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం యొక్క మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత, దీనిని 5 సంవత్సరాల పాటు పొడిగించవచ్చు. ఇది మీ రాబడిని మరింత పెంచుకోవడానికి మరింత సహాయపడుతుంది. మీరు ఏటా కనీసం రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.
మీరు కూడా పిపిఎఫ్ లో చేరాలనుకుంటున్నారా..? అయితే సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి కేవలం రూ. 500 కనీస డిపాజిట్‌తో పిపిఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం అధిక వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మాత్రమే కాకుండా పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది మీకు క్రమం తప్పకుండా ఆదాయం పొందే హామీని కూడా ఇస్తుంది.
ఈ పథకంలో రూ. 5 లక్షలు పొందడానికి, మీరు ప్రతి నెలా రూ. 1500 పెట్టుబడి పెట్టవచ్చు. అంటే మీరు 15 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ. 18,000 చొప్పున చెల్లించాలి. ఇలా మొత్తం రూ. 2,70,000 పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం 7.1% వడ్డీ రేటు ప్రకారం 15 సంవత్సరాలలో మీరు మొత్తం రూ. 2,18,185 వడ్డీని పొందుతారు.
15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మీకు రూ. 4,88,185 లభిస్తుంది. మీరు ఎక్కువ రాబడిని కోరుకుంటే, ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు.