రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన భారత దేశంలో అత్యంత ధనవంతుడు. ప్రపంచ కుబేరుల్లో ఆయన ఎప్పుడూ టాప్ 10 లో ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగు పెట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదేమో. టెలికాం, పెట్రో ప్రోడక్ట్, ఎలక్ట్రానిక్స్, సూపర్ మార్కెట్స్, క్లాత్స్ ఇలా రిలయన్స్ అన్ని రంగాల్లోనూ వ్యాపారాలు చేస్తోంది.
ప్రస్తుతం 8,49,926 కోట్ల రూపాయల ఆస్తులతో ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఆయన నడిపిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 17,27,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీగా రికార్డుల్లో ఉంది.
ఈ రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను కొనుగోలు చేయడానికి వాల్ట్ డిస్నీతో ఒక ఒప్పందంపై సంతకం చేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రెండు కంపెనీలను విలీనం చేయాలని అంబానీ ఆలోచిస్తుండగా, దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం.
అంబానీ హాట్‌స్టార్‌ని కొనుగోలు చేస్తే దాని పేరు జియో హాట్‌స్టార్‌గా మారే అవకాశం ఉంది. దీంతో JioHotstar.com డొమైన్‌కి చాలా డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ డొమైన్ ను ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ఇప్పటికే కొనుగోలు చేశారు. హాట్‌స్టార్ విషయంలో వాల్ట్ డిస్నీ, జియో మధ్య ఒప్పందం పూర్తి కాకముందే డొమైన్‌ను కొనుగోలు చేశారు.
దేశ రాజధాని డిల్లీకి చెందిన ఓ యాప్ డెవలపర్ ఈ డొమైన్ కొనుగోలు చేశారు. అయితే అతను గత నెలలో JioHotstar.com డొమైన్‌ను కోటి రూపాయలకు అమ్మకానికి పెట్టారు. కేంబ్రిడ్జ్‌లో చదువుకోవాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి ఈ డొమైన్ అమ్ముతున్నట్లు యాప్ డెవలపర్ ప్రకటించారు. ఆ యాప్ డెవలపర్ రూ.కోటి కి ఈ డొమైన్ అమ్ముతానని ముందుగా రిలయన్స్ కు ఆఫర్ ఇచ్చారు. అయితే అంబానీ ఈ ఆఫర్ కి ఒప్పుకోలేదు.
ఇంతలో ఈ డీల్ మధ్యలోకి ఓ ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఎంటర్ అయ్యారు. గట్టిగా 15 ఏళ్లు కూడా నిండని చిన్నారులు జైనం, జీవిక ఇద్దరూ కలిసి ఈ డొమైన్ ను యాప్ డెవలపర్ నుంచి కొనుగోలు చేశారు. ఏకంగా రూ.కోటి ఇచ్చి యాప్ డెవలపర్ నుంచి కొనుగోలు చేశారు.
కేవలం కేంబ్రిడ్జ్‌లో చదువుకోవాలన్న తన కల నెరవేర్చుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేక డొమైన్ అమ్ముతున్నానని యాప్ డెవలపర్ చెబుతుండగా, అతని చదువుకు సాయం చేయాలన్న ఉద్దేశంలో ఈ డొమైన్ కొనుగోలు చేశామని పిల్లలు జైనం, జీవిక చెబుతున్నారు.
ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు దుబాయ్ లో ఉంటారు. అక్కడ చదువుకుంటూనే చిన్నపాటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. జైనం, జీవిక ఇద్దరూ కలిసి సేవక్ ఆర్మీ.కామ్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రిలయన్స్ కి పోటీగా JioHotstar.com డొమైన్‌ను కొనుగోలు చేయలేదని, కేవలం సేవా కార్యక్రమాలు వేగంగా చేయడానికి కొన్నామని చిన్నారులు ప్రకటించారు.
ఇప్పుడు ఆ డొమైన్‌ను ముఖేష్ అంబానీ కంపెనీకి ఉచితంగా ఇస్తామని జైనం, జీవికా ప్రకటించారు. సేవ కోసమే డెవలపర్ నుండి డొమైన్ కొన్నామని, రిలయన్స్ జియో ఈ డొమైన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఉచితంగా ఇస్తామని వారు ప్రకటించారు. దీంతో jiohotstar.com డొమైన్‌ను ఉచితంగా పొందే అవకాశం ముఖేష్ అంబానీ కంపెనీకి లభించింది. ముఖేష్ అంబానీకే ఉచిత ఆఫర్ ఇచ్చిన ఈ పిల్లల నిర్ణయాన్ని రిలయన్స్ అంగీకరిస్తుందా లేక తదుపరి స్టెప్స్ ఎలా ఉంటాయన్నది తెలియాల్సి ఉంది.