మౌలిక వసతులను కల్పించిన మరుక్షణం భారతదేశ మార్కెట్లోకి 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తామని చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో పేర్కొంది.
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో త్వరలో భారత విపణిలోకి 5జీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరిస్తామని ప్రకటించింది. ఇప్పటికే దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్, చైనా దిగ్గజాలు షియోమీ, హువావే, ఒప్పో సంస్థలు ‘5జీ’ స్మార్ట్ ఫోన్లు ఆవిష్కరిస్తామని ప్రకటించాయి. శామ్ సంగ్ వచ్చేనెల మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా ‘5జీ’ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సర్వం సన్నద్ధం చేసుకుంటున్నది.
వివో ఇండియా మార్కెటింగ్ స్ట్రాటర్జీ హెడ్ నిపుణ్ మార్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘5జీ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో ఎప్పుడైనా విడుదల చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చిప్ సెట్ మేకింగ్ జెయింట్ ఖ్వాల్ కామ్, కంపెనీలు హయ్యర్, టీసీఎల్‌లతో కలిసి పని చేస్తున్నాం ’ అని తెలిపారు.
2016లోనే 5జీ టెక్నాలజీ డెవలప్‌మెంట్, స్టాండర్డైజేషన్ కోసం బీజింగ్‌లో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ 5జీ స్మార్ట్ ఫోన్ల కోసం వివో చూస్తోందని నిపుణ్ మార్య చెప్పారు. ఈ ఫోన్లను మేం ‘ఇంటెలిజెంట్ ఫోన్లు’ అని పేర్కొన్నామని తెలిపారు.
ప్రస్తుతం భారత్ మార్కెట్లో శరవేగంగా అమ్ముడవుతున్న బ్రాండ్లలో చైనా ‘వివో’ బ్రాండ్ ఒకటి. గతేడాదితో పోలిస్తే 2019 జనవరిలో వివో ఫోన్ల విక్రయంలో 60 శాతానికి పైగా మార్కెట్ పెంచుకున్నది వివో అని నిపుణ్ మార్య చెప్పారు.
గతేడాది జనవరిలో వివో ఫోన్ల విక్రయాలు 60.9 శాతం అయితే ఈ ఏడాది 63.9 శాతం అని తెలిపారు. విలువ పరంగా 16.8 శాతం, వాల్యూమ్స్ పరంగా 14.2 శాతం పురోగతి సాధించామని వివో ఇండియా మార్కెటింగ్ స్ట్రాటర్జీ హెడ్ నిపుణ్ మార్య చెప్పారు.
భారతదేశ వ్యాప్తంగా 70 వేలకు పైగా రిటైల్ షాపులను కలిగి ఉన్న సంస్థ వివో. వివో 200 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, రెండు ఎక్స్ పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది. గతేడాది యమునా ఎక్స్ ప్రెస్ వే పరిధిలో నూతన ఉత్పాదక సంస్థ కోసం రూ.4000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
దీనివల్ల ఉత్తర్ ప్రదేశ్‌లో తొలిదశలో 5000 ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే 50 ఎకరాల్లో ఉత్పాదక యూనిట్ ప్రారంభించిన వివో 169 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.