
కొన్ని రోజుల క్రితం మోకాలి గాయానికి సర్జరీ చేయించుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, శనివారం తన హెల్త్ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఓ నోట్ ద్వారా తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని వరుణ్ తెలిపారు.
వరుణ్ తేజ్ పోస్ట్ లో ఏముందంటే.. "నా ఆరోగ్యం గురించి ప్రేమగా అడిగి తెలుసుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ నాకు చాలా ముఖ్యం. సర్జరీ సక్సెస్ అయింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను, పూర్తి శక్తిని తిరిగి పొందే పనిలో ఉన్నాను. నాకు ట్రీట్‌మెంట్ అందించిన డాక్టర్లకు నా కృతజ్ఞతలు. త్వరలోనే మీ ముందుకు వస్తాను... మునుపటి కంటే మరింత స్ట్రాంగ్‌గా. మీ ప్రేమతో, వరుణ్ తేజ్," అని ఆయన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
వరుణ్ ఈ పోస్ట్ పెట్టిన వెంటనే, అభిమానులు కామెంట్స్ సెక్షన్‌లో 'త్వరగా కోలుకోండి' అంటూ విషెస్ తెలిపారు. 'టేక్ కేర్ అన్నా, మీరు త్వరగా రికవర్ అవ్వాలి' అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కామెంట్ చేయగా, 'వరుణ్ అన్నా, గెట్ వెల్ సూన్' అని మరొకరు రాశారు.
ఈ వారం మొదట్లో, వరుణ్ తేజ్ చెల్లెలు, మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఆరోగ్యం గురించి ఓ ప్రకటన విడుదల చేశారు. వరుణ్ డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని నిహారిక తెలిపారు. "మా తర్వాతి సినిమా 'బరి' కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మా అన్నయ్య మోకాలికి తీవ్రమైన గాయమైంది. ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తయింది.
ప్రస్తుతం ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు" అని నిహారిక చెప్పారు. "అన్నయ్య త్వరలోనే పూర్తిగా కోలుకుని, మళ్లీ ఆరోగ్యంగా తిరిగి వస్తాడనే నమ్మకం మాకుంది. ఈ కష్ట సమయంలో ప్రేమతో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు" అని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు. 'బరి' సినిమా కోసం సిద్ధమవుతున్న సమయంలోనే వరుణ్‌కు ఈ గాయమైనట్లు తెలుస్తోంది.