మొన్న సుశాంత్.. నేడు సుశీల్: చిత్ర పరిశ్రమలో మరో యువనటుడి ఆత్మహత్య

By Siva KodatiFirst Published Jul 8, 2020, 6:44 PM IST
Highlights

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ఇంకా మరిచిపోకముందే కర్ణాటకలో ప్రముఖ యువ టీవీ నటుడు సుశీల్ గౌడ బలవన్మరణానికి పాల్పడ్డారు

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ఇంకా మరిచిపోకముందే కర్ణాటకలో ప్రముఖ యువ టీవీ నటుడు సుశీల్ గౌడ బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఆయన వయసు 30 సంవత్సరాలు. సుశీల్ స్వస్థలం మాండ్యలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అంతపుర అనే రొమాంటిక్ సీరియల్‌లో నటించిన సుశీల్ మంచి గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.

అలాగే కన్నడ చిత్రాల్లో నటించేందుకు సుశీల్ ప్రయత్నాలు చేస్తుండేవారు. హీరో దునియా విజయ్ నటిస్తున్న తాజా చిత్రంలో సుశీల్ పోలీస్ పాత్రలో నటించారు. అయితే ఆ చిత్రం విడుదలకు ముందే ఆయన ఆత్మహత్యకు పాల్పడటం స్నేహితుల్లో, శాండల్‌వుడ్‌లో, టీవీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.

మరోవైపు సుశీల్ ఆత్మహత్యపై హీరో దునియా విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను సుశీల్‌ను మొదటిసారి చూసినప్పుడు.. అతను హీరో కావాల్సిన వ్యక్తి అనుకున్నానని అన్నారు. కానీ సినిమా విడుదలకు ముందే సుశీల్ మనల్ని విడిచి వెళ్లిపోయారు.

సమస్య ఏదైనా ఆత్మహత్య దానికి పరిష్కారం కాదని.. ఈ ఏడాది వరుస మరణాలు కనుమరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదని అనిపిస్తోందని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కేవలం కరోనా వైరస్ భయం వల్లనే కాదు... జీవనం సాగించడానికి డబ్బు దొరకదనే నమ్మకం కోల్పోవడం వల్ల కూడా... ఈ విపత్కర సమయంలో అత్యంత ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందని దునియా విజయ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

కాగా సుశీల్ ఆత్మహత్యపై అతని సహనటి అమితా రంగనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అతని మరణ వార్త స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని.. సుశీల్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నానని, అతను చాలా మంచి వ్యక్తని, ఎప్పుడూ కూల్‌గా ఉంటాడు. ఇంత చిన్న వయసులో సుశీల్ మరణించడం చాలా బాధ కలిగిస్తోందని అమిత తెలిపారు. 

click me!