జైలుకు పంపినా వెనక్కి తగ్గను...విజయ్, తండ్రి మధ్య తారాస్థాయికి చేరిన వివాదం

By team teluguFirst Published Nov 22, 2020, 8:54 AM IST
Highlights

కోలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా ఎదిగిన విజయ్ రాజకీయ అరంగేట్రం చేయాలని, ఆయన అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. స్టార్ హీరోగా కెరీర్ పీక్స్ లో ఉండగా, ఇలాంటి నిర్ణయం సరికాదని విజయ్ ఈ విషయంపై నోరుమెదపడం లేదు. ఐతే విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆయనను రాజకీయాల వైపుకు మళ్లేలా తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు...తండ్రి కొడుకుల మధ్య వివాదానికి కారణం అయ్యాయి.

కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ 'విజయ్ విష వలయంలో చిక్కుకుని కొట్టామిట్టాడుతున్నాడని'  సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విజయ్‌ చుట్టూ దుష్టశక్తులు చేరాయన్నారు. మూడు రోజులకు ముందు విజయ్‌ అభిమాన సంఘాల సమాఖ్యగా ఉన్న విజయ్‌ మక్కల్‌ ఇయక్కంను రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్‌ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఆ ప్రకటన జారీ చేసిన కొద్ది సేపటికే విజయ్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ప్రారంభించిన పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని, తన అభిమానులెవరూ ఆ పార్టీలో చేరవద్దని కోరారు. అంతేకాకుండా విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరును గానీ, ఆ ఇయక్కం పతాకాన్ని, తన ఫొటోను వాడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆ నేపథ్యంలో చెన్నైలో చంద్రశేఖర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విజయ్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, విజయ్‌ మక్కల్‌ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చాలన్నది తాను తీసుకున్న నిర్ణయమని చెప్పారు.

1993నుంచి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం భారీ ఎత్తున సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఆ ఇయక్కం సభ్యులకు తగిన గుర్తింపు ఇవ్వాలన్న ఆశయంతోనే రాజకీయ పార్టీగా రిజిస్టర్‌ చేయించానని తెలిపారు. రాజకీయ పార్టీపై విజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత నిర్ణయాలనీ చెప్పారు. ఇక తన భర్త ప్రారంభించిన పార్టీలో తాను సభ్యురాలిగా లేదంటూ చంద్రశేఖర్‌ సతీమణి, విజయ్‌ తల్లి శోభాచంద్రశేఖర్‌ ప్రకటించారు. గత కొంతకాలంగా విజయ్‌కి చంద్రశేఖర్‌కు మధ్య మనస్పర్థలు కొనసాగుతుండటం వాస్తవమేనన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రశేఖర్‌ తమిళ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌కి మంచి చేయాలన్న తలంపుతోనే తాను పార్టీని ప్రారంభించానని చెప్పారు. ఈ విషయాన్ని విజయ్‌ త్వరలో అర్థం చేసుకుంటాడన్నారు.

తన ఫొటోను, ఇయక్కం పతాకాన్ని ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని విజయ్‌ హెచ్చరించడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ తనపై చర్యలు తీసుకుని జైలుకు పంపినా బాధపడనని చెప్పారు. విజయ్‌కి అభిమాన సంఘాన్ని మొట్టమొదట ఏర్పాటు చేసింది తానేనని, ఆ తర్వాత మక్కల్‌ ఇయక్కంగా మార్చి వ్యవస్థాపకుడిగా ఉన్నానని చంద్రశేఖర్‌ వివరించారు. వ్యవస్థాపకుడిగా ఉంటున్న తాను విజయ్‌ మక్కల్‌ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చటం తప్పుకాదన్నారు. తండ్రీకొడుకుల మధ్య మనస్పర్థలు రావడం, మాట్లాడకుండా ఉండటం సాధారణమైన విషయాలేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం తన తనయుడు విజయ్‌కి తెలియకుండానే పలు రహస్య సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్‌ జారీ చేసిన ప్రకటన ఆయనే స్వయంగా విడుదల చేసింది కాదని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.
 

click me!