
హీరో సూర్యకి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. రజనీ తర్వాత ఈ ఘనత దక్కించుకున్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు. గజినీ, సింగం సిరీస్ లాంటి చిత్రాలతో సూర్య తెలుగులో కూడా అభిమానులని సొంతం చేసుకున్నారు. సూర్య చిత్రాలకు తెలుగులో బలమైన మార్కెట్ ఉంది. అందుకే సూర్య చిత్రాలు రిలీజ్ అయినప్పుడు తెలుగు స్టార్ హీరోల చిత్రాల స్థాయిలో హంగామా ఉంటుంది.
కానీ ఒక రీరిలీజ్ చిత్రానికి కూడా మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తోంది. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రం విడుదలై దాదాపు 15 ఏళ్ళు గడుస్తోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 4న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. అందరూ ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఈ చిత్ర రీరిలీజ్ కి కళ్ళు చెదిరే రెస్పాన్స్ వస్తోంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చిత్రాలు రీరిలీజ్ అయితే ఎలాంటి హంగామా ఉంటుందో సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రానికి ఆస్థాయిలో థియేటర్స్ లో రచ్చ కనిపిస్తోంది.
సాంగ్స్ కి అభిమానులు స్క్రీన్ వద్దకు వెళ్లి గెంతులు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో సూర్య సైతం తెలుగు అభిమానుల గోలకి ఆశ్చర్యపోతూ తన స్పందన తెలిపాడు. ఫ్యాన్స్ థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు.
'మీరు చూపిస్తున్న ఈ ప్రేమ నాకు పెద్ద సర్ప్రైజ్. సూర్య సన్నాఫ్ కృష్ణన్ టీం తరపున మీకు నా థ్యాంక్స్. మీరే ది బెస్ట్ అంటూ సూర్య ట్వీట్ చేశారు. సూర్య ఈ చిత్రంలో తండ్రిగా, కొడుకుగా ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టాడు. సిమ్రాన్, సమీరా రెడ్డి సూర్యకి జంటగా నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య నుంచి ప్రేమికుడిగా, వృద్ధుడైన తండ్రిగా, సైనికుడిగా విలక్షణమైన నటన చూడొచ్చు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అప్పటి యువతని విపరీతంగా ఆకట్టుకుంది.