
స్టార్ హీరోలు,నిర్మాతలు తమ సినిమాలు సక్సెస్ అయ్యినప్పుడు తమ టీమ్ ని సత్కరించటం, డైరక్టర్ కు అయితే కారు వంటివి గిప్ట్ గా ఇవ్వటం చేస్తూంటారు. మొన్నామధ్య పుష్ప సినిమా హిట్ సాధించిన అనంతరం హీరో అల్లు అర్జున్ కూడా చిత్ర టీమ్ కి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరోలు మొదలెట్టిన ఈ సంప్రదాయం తెలుగులోనూ ఇప్పుడిప్పుడే పెద్ద హీరోలు కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ సైతం అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే...
ఎస్ ఎస్ రాజమౌళి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో గత నెల 25న అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్లతో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టిస్తోందని ఆల్రెడీ నిర్మాతలు ప్రకటన కూడా చేసారు.
ఆర్ఆర్ఆర్ ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడంతో ఒకపక్క హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో ముందడగు వేసారు. తన మంచితనాన్ని చాటుకున్నారు. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు.
సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు. వారితో కాసేపు ముచ్చటించిన రామ్ చరణ్.. అనంతరం వారందరికీ ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడడంతో పాటుగా ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని, ఈ సందర్భంగా రామ్ చరణ్ అన్నారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.