కరణ్‌జోహార్ పార్టీ: సోషల్ మీడియాలో వీడియో వైరల్, రంగంలోకి ఎన్సీబీ

By Siva KodatiFirst Published Sep 19, 2020, 6:58 PM IST
Highlights

బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ సప్లై జరిగిందా...? హాజరైన స్టార్లు మత్తు పదార్ధాలు తీసుకున్నారా..? ఏడాది క్రితం జరిగిన ఈ పార్టీ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది

బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ సప్లై జరిగిందా...? హాజరైన స్టార్లు మత్తు పదార్ధాలు తీసుకున్నారా..? ఏడాది క్రితం జరిగిన ఈ పార్టీ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.

2019 జూలైలో బాలీవుడ్ స్టార్ల కోసం కరణ్ జోహార్ తన ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కరణ్ షేర్ చేశారు. ఆ తర్వాత ఇది డ్రగ్స్ పార్టీ అనే ఆరోపణలు మొదలయ్యాయి.

పలువురు రాజకీయ నాయకులు కూడా దీనిని తప్పుబట్టారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాము డ్రగ్స్ తీసుకోలేదని పార్టీకి హాజరైన స్టార్స్ వివరించారు.

అలాంటి తప్పు జరిగి వుంటే ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తానని కరణ్ జోహార్ సైతం మీడియాతో అన్నారు. ఈ పార్టీలో కరణ్ జోహార్‌తో పాటు దీపికా పదుకోణే, మలైకా అరోరా, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్ మొదలైన వారున్నారు.

కానీ సుశాంత్ ఆత్మహత్య తర్వాత అది అనేక మలుపులు తిరిగింది. నెపోటిజంతో మొదలైన చర్చ డ్రగ్స్ దగ్గర ఆగింది. ఇండస్ట్రీలో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడేస్తున్నారని ఆరోపణలు పెరిగాయి.

Also Read:బాలీవుడ్ లో డ్రగ్ బానిసలు ఉన్నారు, కానీ...షోలే నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

దీనిపై వారం క్రితం శరోమణి అకాలీదళ్ నాయకుడు మంజీందర్ సింగ్ కేసు సైతం పెట్టారు. పార్టీకి వెళ్లినవారు డ్రగ్స్ తీసుకున్నారని ఆ ఫిర్యాదులో ఆయన ప్రస్తావించారు. కేసు పెట్టినట్లు తెలుపుతూ వివరాలు కూడా ట్వీట్ చేశారు.

నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశానని, విచారణ చేపట్టమని కోరానని మంజీందర్ తెలిపారు. అంతేకాకుండా కరణ్ షేర్ చేసిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్సీబీ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.

ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో అసలైందా..? లేక నకిలీదా..? అని తెలుసుకునే పనిలో పడినట్లు సమాచారం. ఒకవేళ వీడియో నిజమైనదతే విచారణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బాలీవుడ్ డ్రగ్స్ విషయంలో రెండుగా చీలింది. కొందరు చేసిన తప్పుకు అందరినీ నిందించొద్దని వాదిస్తున్నారు జయా బచ్చన్. ఆమెకు మద్ధతుగా చాలా మంది నిలిచారు.

అటు నటుడు రవికిషన్‌తో పాటు కంగనా, జయప్రద మొదలైన స్టార్లు బాలీవుడ్ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని ఆరోపిస్తున్నారు. సుశాంత్ కేసు విచారణలో రియా చక్రవర్తిని విచారిస్తున్న తరుణంలో డ్రగ్స్ వాడకం గురించి బయటపడింది.

ఇది బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది. దీంతో ఎన్సీబీ అధికారులు విచారణ చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం , సరఫరా అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్  చేశారు. 

click me!