
నాచురల్ స్టార్ నాని ఆచితూచి కథలు ఎంచుకుని ముందుకు వెళ్తున్నారు. ఆయన ఇటీవల దసరా మూవీతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్ అందుకోవటంతో ఆయన సినిమాలపై అందరి దృష్టీ పడింది. ఈ నేపధ్యంలో నెక్ట్స్ తను చేయబోయే సినిమా కథలు మరింత విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎప్పుడూ కొత్త దర్శకులను ప్రోత్సహించే నేచురల్ స్టార్.. ఈ సారి కూడా మరో కొత్త డైరక్టర్ కు అవకాశం ఇచ్చాడు. ఆ దర్శకుడు సిబి చక్రవర్తి.
తెలుగు సినిమా వర్గాల నుంచి అందుతున్న టాక్ ప్రకారం ఒక తమిళ యంగ్ డైరెక్టర్ తో నాని వర్క్ చేయనున్నారు. రీసెంట్ గా శివ కార్తికేయన్ హీరోగా డాన్ మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సిబి చక్రవర్తి, నాని కోసం ఒక అదిరిపోయే స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ సంస్థ ఈ మూవీని నిర్మించనుండగా దీని గురించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. అలాగే ఈ సినిమా ఓ యాక్షన్ కామెడీ అని తెలుస్తోంది.
ప్రస్తుతం శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కెరీర్ 30వ సినిమాలో నటిస్తున్నారు నాని. సీతారామం నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్న మేకర్స్. తండ్రీ-కుమార్తె మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నందున.. హలో డాడీ, హాయ్ డాడీ, డియర్ డాడీ లాంటి పేర్లను పరిశీలిస్తున్నారట మేకర్స్. దాదాపు 'హలో డాడీ' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో నాని కుమార్తెగా కియారా ఖన్నా అనే చిన్నారి కనిపించబోతుంది.