
`దర్శకుడు ప్రియదర్శన్, నేను ఎలాంటి స్నేహితులమో, మా అబ్బాయి ప్రణవ్, ప్రియదర్శన్ కూతురు కళ్యాణి అలాంటి స్నేహితులు` అని స్పష్టం చేశారు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్. ఇటీవల మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు, హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కలిసి దిగిన సెల్ఫీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. వీరిద్దరు లవ్‌లో ఉన్నట్టు రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు.
ఎట్టకేలకు ఈ విషయం మోహన్‌లాల్‌ని చేరింది. దీంతో ఆయన స్పందించారు. ప్రణవ్, కళ్యాణిలపై వస్తోన్న వార్తలను ఖండించారు. `ప్రణవ్, కళ్యాణి బెస్ట్ ఫ్రెండ్స్. నేను, ప్రియదర్శన్ ఎలానో వాళ్ళిద్దరు అలా. ఒక సెల్ఫీ వల్ల ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ఎలా ఊహించుకుంటారా? అనవసరమైన వార్తలు ప్రచారం చేయొద్దు.. వాటిని నమ్మొద్దు` అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రణవ్, కళ్యాణి కలిసి ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నారు. మోహన్‌లాల్, ప్రియదర్శన్ మాదిరిగానే వీరిద్దరు మంచి స్నేహితులు. ఆ చనువుతోనే సెల్ఫీ దిగడం, అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చూసిన వారంతా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్టు రకరకాలుగా రాసుకొచ్చారు. అయితే వీరిద్దరు కలిసి `హృదయమ్` అనే సినిమాలో కలిసి నటిస్తున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు మోహన్‌లాల్ ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో `మరక్కరః ది అరేబియన్ సింహం` చిత్రంలో నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రణవ్, కళ్యాణి కూడా నటిస్తుండటం విశేషం. ఇక కళ్యాణి ప్రియదర్శన్ తెలుగులో `హలో` చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం `మానాడు`, `వాన్` చిత్రాల్లో నటిస్తుంది.