
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా టీజర్ ని రేపు చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదల చేసింది చిత్రబృందం. నిమిషం 19 సెకన్ల పాటు ఈ టీజర్ ని కట్ చేశారు. 'సైర సైర సైర' అంటూ నేపధ్య సంగీతంతో మొదలైన టీజర్ లో ఓ బ్రిటిష్ వ్యక్తి ‘సైరా నరసింహారెడ్డి’ అని అరుస్తున్నప్పుడు చిరంజీవి గుర్రం మీద వచ్చిన సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.
'ఈ యుద్ధం ఎవరిదీ.. మనది' అనే ఒక్క డైలాగ్ టీజర్ పై అంచనాలను పెంచేసింది. నేపధ్య సంగీతం టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ఉయ్యాలవాడ గెటప్ లో చిరంజీవి లుక్ ఆకట్టుకుంటోంది. బ్రిటీష్ నాయకుడు, సైనికులు, ఓ పెద్ద కోట ఇలా భారీ సెటప్ మొత్తం టీజర్ లో కనిపిస్తోంది.
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమా తెరకెక్కుతోంది. నయనతార, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.