
చెన్నై నగరంలో ఐటీ దాడుల కలకలం రేగింది. తమిళ స్టార్ హీరో ఆర్యా గతంలో స్థాపించి, విక్రయించిన రెస్టారెంట్ చైన్ "సీ షెల్" పై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్య నివాసంలోనూ అధికారులు ఏకకాలంలో సోదాలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తనిఖీలు అన్నా నగర్, వేలచ్చేరి సహా నగరంలోని పలు "సీ షెల్" శాఖల్లో కొనసాగుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఐటీ శాఖకు చెందిన అధికారులు రెండు వాహనాల్లో చెన్నై అన్నా నగర్‌లోని సీ షెల్ శాఖ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఐదుగురు అధికారుల బృందం రెస్టారెంట్ లోపలికి ప్రవేశించి తనిఖీలు ప్రారంభించింది. పోలీసులు సెక్యూరిటీగా ఏర్పాటయ్యారు. ఈ దాడులు పూర్తిగా సీక్రేట్ గా జరుపబడుతున్నాయి.
అదే సమయంలో పూనమల్లి హై రోడ్ వద్ద ఉన్న కోలీవుడ్ హీరో ఆర్య నివాసంలో కూడా మరో ఐటీ బృందం తనిఖీలు చేపట్టింది. గతంలో ఆర్య ఈ అరేబియన్ ఫుడ్ చైన్ "సీ షెల్" ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఆపై ఈ రెస్టారెంట్లను ఆయన కేరళకు చెందిన వ్యాపారవేత్త కున్హి మూసాకు విక్రయించినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
ఇటీవల కేరళలో కున్హి మూసా ఆస్తులపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. ఆ విచారణలో భాగంగా చెన్నైలోని సీ షెల్ శాఖలపైనే కాకుండా, గతంలో ఈ సంస్థతో సంబంధం కలిగిన నటుడు ఆర్య నివాసం పైనా దాడులు జరగడం విశేషంగా మారింది. ఐటీ అధికారులు ఈ తనిఖీల్లో ప్రధానంగా రెస్టారెంట్ లావాదేవీలు, యాజమాన్యంలో మార్పులపై దృష్టి సారించినట్లు సమాచారం.
నటుడు ఆర్య కేరళకు చెందిననటుడు. అరిన్తుమ్ అరియామలుమ్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సక్సెస్ ఫుల్ హీరోగా మారాడు. విజయవంతమైన చిత్రాలతో తమిళంలో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వెట్టువమ్" చిత్రంలో నటిస్తున్నారు.
ఈ దాడులకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. ఐటీ శాఖ నుంచి పూర్తి నివేదిక రానివరకు ఈ తనిఖీల వెనుకనున్న అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఈ దాడులు సినీ, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.