
సిల్వర్ స్క్రీన్ పై చూపించాల్సిన హీరోయిజం పబ్లిక్ లో చూపించడంలో తప్పే లేదు. సదరు హీరోయిజం లేదా మేనరిజం నలుగురికి మంచి చేసేదిగా ఉండాలి. కోట్ల మందికి స్ఫూర్తిగా నిలవాల్సిన హీరోలు బహిరంగ ప్రదేశాల్లో బాధ్యతగా ప్రవర్తించాలి. నోటి మాటైనా చేతి చర్య అయినా అదుపాజ్ఞల్లో ఉండాలి. లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ కి ఈ చిన్న విషయం తెలియకపోవడం విచారకరం. సీటు బెల్ట్ పెట్టుకోకుండా కారు నడపడమే నేరమని ట్రాఫిక్ రూల్స్ చెబుతుంటే ఆయనేమో ఏకంగా కారు టాప్ పై కూర్చొని వాయువేగంతో హైవే పై ప్రయాణం చేశారు.
ఇలాంటి చర్యల ద్వారా గుడ్డిగా ఆరాధించే తన అభిమానులకు పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తున్నారో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైతే చాలు ఆయన వేసుకున్న బట్టలను పోలిన బట్టలు ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాము డై హార్డ్ ఫ్యాన్ అని చాటుకునే అభిమానులు ఉన్నారు. కేవలం సినిమాల్లోని తన మేనరిజం, హీరోయిజం అంతగా వాళ్ళను ప్రభావితం చేస్తుంటే, ఇక ప్రమాదకర రియల్ స్టంట్స్ చేస్తుంటే వాళ్ళు ఇమిటేట్ చేయడకుండా ఊరుకుంటారా?. పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి కారు టాప్ పై కూర్చొని ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదకరం. పొరపాటున కారుకు ఏదైనా అడ్డుగా వస్తే డ్రైవర్ బ్రేక్ వేస్తే క్రిందపడే అవకాశం ఉంది.
ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా హీరో షారుక్ ఖాన్ స్టేడియంలో సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. అప్పట్లో అదో పెద్ద న్యూస్ అయ్యింది. దేశవ్యాప్తంగా షారుక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. టాప్ సెలబ్రిటీ హోదాలో ఉండి ఒక చెడు అలవాటుని ప్రమోట్ చేశాడని షారుక్ ని తప్పుబట్టారు. ఆయన చట్టపరమైన చర్యలు ఎదుర్కొన్నాడు. ఇక్కడ షారుక్ సిగరెట్ తాగడం తప్పుకాదు, పబ్లిక్ లో తాగడం తప్పు. ఒక స్టార్ హీరో పబ్లిక్ లో సిగరెట్ తాగడమే తప్పైతే... కారు టాప్ మీద కూర్చొని ప్రాణాలు తీసే ప్రయాణం చేయడం ఎంత తప్పు. దురదృష్టవశాత్తు ఇది పవన్ హీరోయిజంగా అభివర్ణిస్తున్నారు. ఆ లెక్కన షారుక్ చేసింది నేరమే కాదు. తనపాటికి తాను స్టేడియంలో సిగరెట్ తాగుతూ మ్యాచ్ చూశాడు. కెమెరా మెన్ ఆయన్ని చూపించడంతో వివాదమైంది. పవన్ మాత్రం ఒక డ్రోన్ కెమెరా సెట్ చేసుకొని షూట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.
పవన్ కి ఉన్న అతిపెద్ద వీక్నెస్ ఎమోషన్స్ పై అదుపు లేకపోవడం. కోపం వస్తే నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, తోచింది చేయడం పవన్ కి అలవాటు. పుస్తకాల పురుగు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ బహుశా సుమతీ శతకం చదవలేదేమో... ఒకవేళ చదివి ఉంటే తన కోపమే తన శత్రువు అని తెలిసి ఉండేది. పవన్ కళ్యాణ్ చర్యలు, మాటలు అభిమానులను రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. ఇకనైనా పవన్ ఎమోషన్స్ పై అదుపు సాధించకపోతే పరిపూర్ణమైన లీడర్ కావడం కష్టం.