
2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సక్సెస్ఫుల్ గా సాగిపోతుంది. ఐదు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ క్రేజీ రియాలిటీ షో సీజన్ 6 కోసం సరికొత్తగా సిద్దమవుతుంది. ఎన్టీఆర్ తర్వాత హీరో నాని బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించారు. నాని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో కింగ్ నాగార్జున రంగంలోకి దిగారు. మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా మారారు.
బిగ్ బాస్ సీజన్ 3 నుండి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 5 కి కొత్త హోస్ట్ వస్తారన్న ప్రచారం జరిగింది. నాగార్జున ఎంట్రీతో అది పుకారని తేలిపోయింది. లేటెస్ట్ సీజన్ విషయంలో కూడా ఇలాంటి పుకార్లే పుట్టుకొస్తున్నాయి. నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు తీసుకోవడం లేదని కథనాలు వెలువడ్డాయి. ఈసారి కూడా ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు. విడుదలైన ప్రోమో ఆసక్తి రేపుతోంది. అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో అని చెప్పడం ద్వారా సస్పెన్సులో పడేశారు.
మరోవైపు ఈ షో పట్ల కొంత వ్యతిరేకత ఉంది. గతంలో సాంప్రదాయ వాదులు హోస్ట్ నాగార్జున ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీసే ఇలాంటి షోస్ నిషేధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవేమి పట్టించుకోకుండా నిర్వాహకులు ముందుకు వెళుతున్నారు. బిగ్ బాస్ షోకి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణే దీనికి కారణం.