
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండియన్ 2 చిత్రం పాన్ ఇండియా మూవీగా మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 100 ఏళ్ళు పైబడిన సేనాపతిగా కమల్ హాసన్ ఎలాంటి విన్యాసాలు చేయబోతున్నారు ? శంకర్ ఈసారి ఈ చిత్రంలో ఎలాంటి అవినీతిని చూపించబోతున్నారు అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
భారతీయుడు 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో చిత్ర యూనిట్ కి ఊహించని షాక్ తగిలింది. మధురై కోర్టు ఇండియన్ 2 చిత్ర యూనిట్ కి నోటీసులు పంపింది. కొన్ని రోజుల క్రితం రాజేంద్రన్ అనే వ్యక్తి ఇండియన్ 2 మూవీపై కోర్టులో పిటిషన్ వేశారు.
తన అనుమతి లేకుండా ఈ చిత్రంలో మర్మకళని వాడుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. మర్మకళ అనేది అరుదైన మార్షల్ ఆర్ట్. ఇందులో రాజేంద్రన్ నిపుణుడు. భారతీయుడు మొదటి భాగంలో కమల్ హాసన్ కి మర్మకళ ట్రైనింగ్ ఇచ్చింది ఇతడే. మర్మకళ పై రాజేంద్రన్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ అంశాన్ని డైరెక్టర్ శంకర్ భారతీయుడు చిత్రంలో పెట్టారు. దీనికి గాను ఆ సినిమా క్రెడిట్స్ లో రాజేంద్రన్ పేరు కూడా వేశారు.
ఇప్పుడు అదే టెక్నిక్ ని భారతీయుడు 2లో కూడా చూపించారు. దీనితో రాజేంద్రన్ కోర్టుని ఆశ్రయించారు. తనకి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా తన విద్యని ఉపయోగించుకుంటున్నారని రాజేంద్రన్ పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపి ఇండియన్ 2 చిత్ర యూనిట్ కి నోటీసులు పంపింది. వివరణ ఇవ్వాలని కోరింది. విచారణని గురువారానికి వాయిదా వేశారు.