
సంతోష్ శోభన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నీ మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించారు. వేసవి కానుకగా ఈ సినిమాను మే 18న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. . ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేసారు.
అదేమిటంటే..ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ సంతోష్ శోభన్ కాదట. విజయ్ దేవరకొండ కోసం కథ రాసుకున్నారట ఆమె. విజయ్ కు నేరేట్ చేసారట. అయితే ఎప్పుడైతే అర్జున్ రెడ్డి రిలీజైందో అప్పుడే ఓవర్ నైట్ లో విజయ్ ఇమేజ్ మారిపోయింది. దాంతో అతనితో చేయాలనే ఆలోచనను ప్రక్కక పెట్టేసారట ఆమె. సంతోష్ శోభన్ ని మాత్రం నిర్మాత స్వప్నా దత్ సూచించారట. స్క్రీన్ టెస్ట్ చేసి అతన్ని తీసుకున్నారట. ఇక ఇప్పటికే ట్రైలర్ రిలీజై సినిమాపై అంచనాలు పెంచేసింది.
ట్రైలర్ విషయానికి వస్తే... కామెడీ, ఎమోషన్లకు పెద్ద పీట వేసినట్లు అర్థం అవుతుంది. అలాగే సినిమాలో ఫారిన్ లొకేషన్లు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి నిర్మాతలు ఖర్చుకు అస్సలు వెనకాడలేదు అని అనుకోవచ్చు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ చిన్నప్పటి సన్నివేశాలు, వారు ప్రేమలో పడటం, మధ్యలో ఫారిన్ లొకేషన్లు... ట్రైలర్ సగం వరకు ఇలా సరదా సరదాగా సాగింది. ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి నేపథ్యంలో వచ్చిన గొడవలతో ఒక్కసారిగా సీరియస్ టర్న్ తీసుకుంది. రెండు కుటుంబాల మధ్య పెళ్లి, వారి మధ్య వచ్చే ఈగో సమస్యల నేపథ్యంలో కథ రాసుకున్నట్లు కనిపిస్తుంది.
ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన మాళవికా నాయర్ చేసింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు ఆల్వా నాయక్, అశ్విన్ కుమార్ సహా పలువురు నటీనటులు ఇందులో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. లక్ష్మీ భూపాల మాటలు అందించారు. సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. జునైద్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.