పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించిన పుష్ప 2 సినిమా తర్వాత, హీరో అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ఈసారి ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి సిద్ధమవుతున్నారు. పుష్ప సిరీస్ విజయం ఆయనకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టగా, తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవలే అల్లు అర్జున్ ముంబయిలోని మెహబూబ్ స్టూడియోలో లుక్ టెస్ట్ నిర్వహించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రెండో లుక్ టెస్ట్ కూడా జరగనుంది. ఈ పరీక్ష కూడా ముంబయిలోనే నిర్వహించనున్నారు.
ఈ రెండో రౌండ్లో అల్లు అర్జున్ మరిన్ని లుక్స్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు, వాటిలో ఒక లుక్‌లో హెవీ ప్రోస్తెటిక్స్ మేకప్ ఉపయోగించనున్నట్లు సమాచారం. పాత్రకు తగ్గట్టు భిన్నమైన మేకోవర్లను ప్రయత్నిస్తూ నటనకు కొత్త ఒరవడి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ లుక్ టెస్ట్‌లు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అట్లీ చిత్రం కోసం అల్లు అర్జున్ మల్టిపుల్ గెటప్పులలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రాలేదు. కానీ ఈ లుక్ టెస్ట్‌ల ఆధారంగా సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తీరు, ఆయన గెటప్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అట్లీతో అల్లు అర్జున్ మొదటిసారి పనిచేయనుండటంతో ఇది అభిమానుల్లో పెద్ద అంచనాలు పెంచుతోంది.
ఈ చిత్రం పార్లల్ యూనివర్స్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ నూతన ప్రయోగం టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది.