
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కాలపరిమితి ముగియడంతో మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు 'మా' అధ్యక్షుడిగా వ్యవహరించిన శివాజీరాజా మరోసారి పోటీకి సిద్ధమవుతుండగా.. ఆయన మీద పోటీగా సెక్రటరీగా వ్యవహరించిన హీరో నరేష్ ఏకంగా సొంత ప్యానెల్ పెట్టేశారు.
నరేష్ అధ్యక్ష పదవికి, జీవిత రాజశేఖర్ లు ప్యానల్ లో కీలక పదవుల కోసం పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో నటి శ్రీరెడ్డి వేలుపెట్టింది. టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ విషయంలో అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి వ్యవహార శైలిని జీవిత బహిరంగంగానే తప్పుబట్టింది.
అప్పట్లో శ్రీరెడ్డి, జీవితల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు జీవిత, రాజశేఖర్ లు 'మా'లో పదవుల కోసం పోటీ పడటాన్ని తప్పుబడుతూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
''నరేష్ గారు మీరంటే గౌరవమే.. కానీ ఎవరికీ పట్టం కడదామనుకుంటున్నారు. మీ పక్కన కూర్చున్న వాళ్ల వ్యక్తిత్వాల గురించి ఆలోచించారా..? దీనికి నేను ఒప్పుకోను. సైలెంట్ గా ఉండలేను. దయచేసి ప్యానల్ ని స్పాయిల్ చేయొద్దు'' అంటూ జీవితరాజశేఖర్ లతో నరేష్ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది.