
దాదాపు ఐదు వందల సినిమాల్లో నటించిన పొట్టి వీరయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టి వీరయ్య.. ఆదివారం ఉదయం గుండె పోటు రావడంతో ఓ ప్రవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో.. వీరయ్య సాయంత్రం 4.33 నిమిషాలకు మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. సోమవారం వీరయ్య అంత్యక్రియలు మహా ప్రస్థానంలో జరగనున్నాయి.
విఠలాచార్య ‘అగ్గిదొర’ చిత్రంతో మరుగుజ్జు నటుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. దాసరి ప్రోత్సాహంతో తాతమనవడు చిత్రంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500లకు పైగా చిత్రాల్లో వీరయ్య నటించారు. వీరయ్య మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. ‘రాధమ్మ పెళ్లి’, ‘జగన్మోహిని’, ‘యుగంధర్’, ‘గజదొంగ’, ‘గోల నాగమ్మ’, ‘అత్తగారి పెత్తనం’, ‘టార్జాన్ సుందరి’ తదితర చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు.
వీరయ్య నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఫణిగిరి గ్రామంలో జన్మించారు. హైస్కూల్ వరకూ చదువుకున్నారు. స్కూల్లో, వేదికలపై నాటకాలు వేసేవారు. అనంతరం నటుడు అవ్వాలని మద్రాసు చేరుకున్నారు. తొలుత సినిమాలకు డెకరేషన్ చేసే ప్లవర్ షాపులో కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో నటుడు శోభన్‌బాబును కలిసి విషయం చెప్పడంతో ‘వీరయ్య నీకు వేషాలు ఇవ్వాలంటే విఠలాచార్య, భావన్నారాయణ లాంటి వారు మాత్రమే ఇవ్వగలరు. వెళ్లి కలువు’ అని సలహా ఇవ్వడంతో విఠలాచార్యను కలిసి అవకాశం దక్కించుకున్నారు.
నటుడు రాజబాబు, దర్శకరత్న దాసరి లాంటి వారు తనని ఎంతో ప్రోత్సహించారని పొట్టి వీరయ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో వీరయ్య అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వీరయ్య భార్య మల్లిక 2008లో కన్నుమూశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె విజయదుర్గ సినిమాల్లోనూ నటించారు.