దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న ఆటో ఎక్స్ పోలో భారత కంపెనీ నాలుగు మోడల్ కార్లు ఆవిష్కరించింది. ఆల్ట్రోజ్ మినహా ఇతర మోడల్ కార్లు ఎప్పుడు విపణిలో అడుగు పెడతాయో బయటపెట్టలేదు. అయితే వినూత్న ఆవిష్కరణల దిశగా టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది.
జెనీవా: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. ఇతర కార్ల తయారీ సంస్థలకు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతోంది. తాజాగా వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న కార్ల డిజైన్లతో విపణిలోకి రానున్నది. ఇప్పటికే పలు మోడల్స్‌తో రికార్డులు నెలకొల్పిన టాటా మోటార్స్ తాజాగా నాలుగు సరికొత్త వాహనాలను విపణిలోకి తేనున్నది.
జెనీవా వేదికగా జరుగుతున్న 89 ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ విభాగంతోపాటు, ఒక ఎలక్ట్రిక్ వెహికల్‌ను టాటా మోటార్స్ ప్రదర్శించింది. ఆల్ట్రోజ్, ఆల్ట్రోజ్ ఈవీ, బుజార్డ్, హెచ్2ఎక్స్ కాన్సెప్ట్‌లుగావీటికి నామకరణం చేసింది.ఇక ముందు తయార్యే కార్లన్నీ ఆప్టిమల్ మాడ్యులర్ ఎఫిసియెంట్ గ్లోబల్ అడ్వాన్స్‌డ్ (ఒమెగా), ఎజిల్ లైట్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్‌తో తయారు కానున్నాయి.
‘ఈ కార్లను సరికొత్త డిజైన్‌తో రూపొందించాం. వాటి విభాగాల్లో అవి గేమ్ ఛేంజర్స్‌గా అవతరిస్తాయని భావిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన డిజైన్, టెక్నాలజీతో అభిలషణీయమైన ఉత్పత్తులను అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని టాటా మోటార్స్ ఎండీ, సీఈవో గుంటెర్ బట్స్‌చెక్ తెలిపారు.
వీటిలో బుజార్డ్‌ను హెచ్7ఎక్స్ కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఏడు సీటర్ల ప్రీమియం ఎస్‌యూవీ వాహనం ఇటీవల టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఐదు సీట్ల ప్రీమియం ఎస్‌యూవీ హారియర్‌లా ఇది ఉంటుంది. ధర, డిజైన్ తదితర విషయాలల్లో హారియర్‌తో పోలిస్తే, బుజార్డ్ ఒక మెట్టు పైనే ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 500ను టాటా మోటార్స్ బుజార్డ్ ఢీకొడుతుందని చెప్పవచ్చు.
ఒమెగార్క్ ప్లాట్ ఫామ్ నుంచి వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ‘లాండ్ రోవర్’ ‘డీ8’తరహాలోనే రూపొందించిన మోడల్ కారు టాటా మోటార్స్ బుజార్డ్. అధికారికంగా ఈ కార్లను ఎప్పుడు మార్కెట్లో ఆవిష్కరిస్తుందన్న విషయం గానీ, భారత్ మార్కెట్‌లో దాని పేరును గానీ టాటా మోటార్స్ ప్రకటించలేదు. ఇక ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ను 2019 మధ్యలో విపణిలోకి తీసుకురానున్నారు.
టాటా ఆల్ట్రోజ్ కారు మారుతీ సుజుకీ బాలెనో, హ్యుందాయ్ ఐ20కి పోటీ. టాటా నుంచి వస్తున్న తొలి హ్యాచ్ బ్యాక్ మోడల్ ఇదే కావడం విశేషం. ఆల్ట్రోజ్ మోడల్ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్ ఇంజిన్లలో లభిస్తుంది. ఫ్లెక్సిబుల్ సొల్యూషన్స్ దిశగా టాటా మోటార్స్ అడుగులేస్తున్నది. హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ మోడల్ కారు టాటా మోటార్స్ భవిష్యత్ డిజైన్ డైరెక్షన్ కానున్నది.
ఇక ఆట్రోజ్ ఈవీ అనేది పూర్తి స్థాయి బ్యాటరీతో నడిచే వాహనం. టాటా ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వాహనం 2020లో విపణిలోకి రానున్నది. మహీంద్రా కేయూవీ 100, మారుతీ సుజకీ ఎస్ కాన్సెప్ట్‌కు పోటీగా హెచ్2ఎక్స్ కాన్సెప్ట్‌తో సరికొత్త వాహనాన్ని తీసుకురానున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. జెనీవాలో జరిగిన ఎక్స్ పో కార్యక్రమంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరస్ రతన్ టాటా, చైర్మన్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.