ఈ నెల 22న అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో మార్కెట్లోకి ‘సెల్టోస్’ మోడల్ కారును విడుదల చేయనున్న ‘కియో మోటార్స్ హైదరాబాద్ నగరంలో మూడు షోరూములు ప్రారంభించింది. 2021 నాటికి ఐదు మోడల్ కార్లను ఆవిష్కరించాలన్న లక్ష్యంతో కియా మోటార్స్ ముందుకెళుతోంది.
దేశీయ కార్ల విపణిలోకి కొత్తగా అడుగుపెట్టిన దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజమైన కియా మోటార్స్ శనివారం నాడు ఒకేరోజు హైదరాబాద్‌లో మూడు నూతన షోరూమ్‌లను ప్రారంభించింది. సికింద్రాబాద్‌లో రైల్‌నిలయం సమీపాన, కొండాపూర్, మూసాపేట వై-జంక్షన్ వద్ద ఈ షోరూమ్‌లు ఏర్పాటయ్యాయి.
అత్యంత సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో కియా మోటార్స్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘కియా సెల్టోస్’ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కియా మోటార్స్ సేల్స్ విభాగం ఉపాధ్యక్షుడు మనోహర్ భట్ స్పందిస్తూ హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వినియోగదార్లకు అందుబాటులో ఉండేవిధంగా నూతన షోరూమ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రీమియం కార్లు, ఎస్‌యూవీలకు ఎంతో గిరాకీ ఉన్న ఈ ప్రాంతంలో తాము ఆవిష్కరించి కియా సెల్టోస్ వినియోగదార్లను ఎంతగానో ఆకట్టుకుందని భావిస్తున్నట్లు కియా మోటార్స్ సేల్స్ విభాగం ఉపాధ్యక్షుడు మనోహర్ భట్ తెలిపారు.
అత్యుత్తమైన కార్లను ఆవిష్కరించటంతో పాటు దేశీయ మార్కెట్లో 2021 నాటికి 5 మోడళ్ల కార్లను ఆవిష్కరించాలనే దిశగా కియా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలలకు ఒక కొత్త మోడల్ తేనున్నట్లు కియా మోటార్స్ స్పష్టం చేసింది.
సికింద్రాబాద్ రైల్‌నిలయం ప్రధాన రోడ్డులో విహాన్ ఆటో ఏర్పాటు చేసిన కియా షోరూంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం కియా సెల్టోస్ కారును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జస్టిస్ చల్లా కోదండరాం మాట్లాడుతూ ఆటోమొబైల్ సంస్థలకు ఒకప్పుడు విజయవాడకు ఎంతో గుర్తింపు ఉందన్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటు కావటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.
కియా కార్లు భాగ్యనగరానికి కొత్తదనం తెచ్చిపెడతాయని ఆశిస్తున్నట్లు జస్టిస్ చల్లా కోదండరాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని కియా మోటార్స్ ఇండియా డీలర్ పార్టనర్ సునీల్ వడ్లమూడి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని మూసాపేట వై జంక్షన్‌లోనూ విహాన్ ఆటో, మరో కియా షోరూం ఏర్పాటు చేసింది. ఈ నూతన షోరూంలో కియా సెల్టోస్ కారును తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆవిష్కరించారు. కియా మోటార్స్ డీలర్ పార్టనర్ సునీల్ వడ్లమూడి, ఎమ్మెల్సీ నవీన్‌రావు పాల్గొన్నారు.
కొండాపూర్‌లో నెలకొల్పిన ‘ఆటోమోటివ్ కియా’ షోరూంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన కియా సెల్టోస్ కారును ఆవిష్కరించారు. కారు ధర, డెలివరీ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సింఘ్వి, కియా మోటార్స్ ప్రాంతీయ సేల్స్ మేనేజర్ సుప్రీత్ తదితరులు పాల్గొన్నారు.