ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న వందేమాతరం ఎక్స్‌ప్రెస్ రైలు...ప్రారంభానికి ముందే

By Arun Kumar PFirst Published Feb 12, 2019, 3:26 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ప్రారంభమైన మేకిన్ ఇండియాలో భాగంగా రూపుదిద్దుకుని ఈ నెల 15న పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులకు చుక్కలు చూపనున్నది. ఎనిమిది గంటల్లో ఢిల్లీ నుంచి వారణాసి చేరుకునే ఈ రైలు టిక్కెట్ ధరలు చుక్కలనంటుతున్నాయి. అలాగే భోజనాది తదితర వసతుల ధరలు అలాగే ఉన్నాయి. 

న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా ఇన్షియేటివ్‌తో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు’ ఈ నెల 15న రైలు పట్టాలెక్కనున్నది. కనుక దీని ప్రయాణ టిక్కెట్లు కూడా ఖరారయ్యాయి. కాకపోతే ఆ టిక్కెట్ ధరలు చూస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం.. టిక్కెట్ ధరల నిర్ణయంతోపాటు 8 గంటల పాటు ప్రయాణం సాగనున్నందున భోజన వసతి చార్జీలు అదిరిపోతున్నాయి.

కానీ ఆయా టిక్కెట్ల ధరలు, వసతుల చార్జీలను ఖరారు చేయడంలో ఇటు రైల్వేశాఖ, అటు ఐఆర్సీటీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరించాయని అర్థమవుతోంది. ఈ రైలును ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 15 ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. 

భారత తొలి ఇంజిన్‌ రహిత ట్రైన్‌ అయిన ఈ రైలును తొలుత ‘ట్రైన్‌18’గా పిలిచిన విషయం తెలిసిందే. ఈ రైలులో ఎగ్జిక్యూటివ్‌, చైర్‌ కార్ అనే రెండు తరగతుల టిక్కెట్లను ప్రయాణికులు పొందవచ్చు. ఢిల్లీ-వారణాసి మధ్య రాకపోకలు సాగించనున్న ఈ రైలు ఏసీ చైర్‌ కార్‌ టిక్కెట్‌ ధర రూ.1,850 అయితే.. ఎగ్జిక్యూటివ్‌ తరగతి టిక్కెట్‌ ధర రూ.3,520 అని రైల్వేశాఖ నిర్ణయించింది. తిరుగు ప్రయాణం సమయంలో చైర్‌ కార్‌ టిక్కెట్‌ను రూ.1,795కు, ఎగ్జిక్యూటివ్‌ తరగతి టిక్కెట్‌ను రూ.3,470కు పొందవచ్చు.  

ఢిల్లీ-వారణాసి మార్గంలో ప్రయాణించే శతాబ్ధి రైళ్ల కన్నా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ చైర్‌ కార్‌ ధర 1.5 రెట్లు, అలాగే, ఎగ్జిక్యూటివ్‌ తరగతి టిక్కెట్‌ ధర 1.4 రెట్లు అధికంగా ఉంది. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా పేర్కొంటున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో 16 బోగీలు ఉంటాయి.  గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు ఢిల్లీ- వారణాసి మార్గంలో అనుమతించిన మేరకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.ఈ మార్గంలో వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణించే వారి భోజనం, టీ, అల్పాహారం ధరలు కూడా విభిన్నమే.

కాగా, ఎగ్జిక్యూటివ్‌ తరగతిలో ఢిల్లీ నుంచి వారణాసికి ప్రయాణించే వారికి టీ, అల్పాహారం, భోజనం కోసం రూ.399, చైర్‌ కార్‌ టిక్కెట్‌పై ప్రయాణించే వారికి రూ.344 రుసుం ఉంటుంది. వారణాసి నుంచి ఢిల్లీకి ప్రయాణించే సమయంలో ఎగ్జిక్యూటివ్‌, చైర్‌ కార్‌ తరగతి వారు రూ.349, రూ.288 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలులో ప్రయాణించే వారు తప్పనిసరిగా భోజన బిల్లు చెల్లించాల్సిందే. కాకపోతే ఐఆర్సీటీసీ నుంచి భోజనం పొందితే చైర్‌కార్ బోగీ ప్రయాణికులు రూ.222, ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీ ప్రయాణికులు రూ.244 ఆదా చేయగలుగుతారు.

న్యూఢిల్లీ- వారణాసి మధ్య ప్రయాణించే ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికులకు 399 వసూలు చేస్తున్న రైల్వేశాఖ.. ఢిల్లీ - కాన్ఫూర్ మధ్య రూ.155, ఢిల్లీ - ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) మధ్య ప్రయాణించే వారికి రూ.122 మాత్రమే భోజన తదితర వసతులకు బిల్లు వసూలు చేస్తోంది. 

ఢిల్లీ- కాన్ఫూర్ మధ్య చైర్ కార్ క్లాస్ టిక్కెట్ ధర రూ.1,150 పలికితే, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ ధర రూ.2,245గా నిర్ణయించారు. ఢిల్లీ- అలహాబాద్ మధ్య చైర్ కార్ టిక్కెట్ ధర రూ.1480 అయితే, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ ధర రూ.2,245గా తేల్చారు. ఇక కాన్పూర్ - అలహాబాద్ మధ్య చైర్ కారు టిక్కెట్ రూ.630, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ ధర రూ.1245. కాన్పూర్ - వారణాసి మధ్య చైర్ కారు టిక్కెట్ రూ.1,065 అయితే ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.1,925గా రైల్వేశాఖ నిర్ణయించింది. 

click me!