అదానీకి షాక్, ఒక్క రోజే రూ. 46 వేల కోట్లు కోల్పోయిన అదానీ గ్రూపు కారణం ఇదే..

By Krishna AdithyaFirst Published Jan 25, 2023, 6:38 PM IST
Highlights

ఆసియాలోనే అత్యంత కుబేరుడు గౌతమ్ అదాని ఒక్కరోజే దాదాపు 46 వేల కోట్ల సంపదను కోల్పోయాడు ప్రముఖ ఇన్వెస్టింగ్ ఏజెన్సీ హిండెన్‌బర్గ్ సంస్థ విడుదల చేసిన  నివేదిక ఆధారంగా నేడు గౌతం అదాని గ్రూప్ కు చెందిన దాదాపు అన్ని షేర్లు మార్కెట్ క్యాప్ ను కోల్పోయాయి.

ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్న సమయంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ కు  ఎదురు దెబ్బ తగిలింది, నేడు అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. కంపెనీ  మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.46,000 కోట్ల క్షీణతను ఎదుర్కొంది. నేడు కంపెనీ దాదాపు ఐదు శాతం నష్టపోయింది. అదానీ విల్మార్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీ, అంబుజా సిమెంట్ నష్టపోయాయి. 

అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక బయటకు రావడంతో అదానీ షేర్లు పడిపోయాయి. అదానీ గ్రూప్ షేర్ల ధరను అతిగా చూపుతోందని  ఈ నివేదిక పేర్కొంది. కంపెనీ పనితీరుకు  తగినట్టు కాకుండా అదానీ గ్రూప్ షేర్లు దాదాపు 85 శాతం అధిక ప్రీమియంతో ట్రేడవుతున్నాయని నివేదిక పేర్కొంది. షేర్లు తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. 

అదానీ పోర్ట్స్ 7.3 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3.7 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 8.75 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 3.40 శాతం, ఏసీసీ 7.2 శాతం, అంబుజా సిమెంట్ 9.7 శాతం, అదానీ విల్మార్ 4.99 శాతం పడిపోయాయి. 

కాగా, హిండెన్‌బర్గ్ నివేదికను అదానీ గ్రూప్ అవాస్తవమని ఖండించింది. అదానీ గ్రూప్ పై  వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ సమయంలో నివేదిక వెనుక రహస్య ఉద్దేశాలు ఉన్నాయని ఎత్తిచూపింది. 

అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 20,000 కోట్లను సమీకరించగలిగితే, అది దేశంలోనే అతిపెద్ద FPO అవుతుంది. జూలై 2020లో ఎఫ్‌పిఓ ద్వారా రూ. 15,000 కోట్లను సేకరించిన యెస్ బ్యాంక్ ప్రస్తుతం ఈ రికార్డును కలిగి ఉంది.

click me!