అడిషనల్ టాక్స్ టార్గెట్ రూ.30వేల కోట్లు

By rajesh yFirst Published Jul 8, 2019, 12:47 PM IST
Highlights


వివిధ రాయితీలు, మినహాయింపులు పోనూ బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా అదనంగా రూ.30 వేల కోట్ల ఆదాయం సంపాదించాలనిన కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చైనా, దక్షిణాఫ్రికా, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే భారతదేశంలో సంపన్నులపై పన్ను చాలా తక్కువేనని కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: ఈ ఏడాది పన్ను రాయితీలు, మినహాయింపులు పోయినా, తాజా ప్రతిపాదనలతో ఖజానాకు అదనంగా రూ.30వేల కోట్ల రాబడి సమకూరుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు అదనంగా వడ్డించిన రూ.2 ఎక్సైజ్‌ సుంకం, సెస్సు ద్వారా రూ.22,000 కోట్లు సమకూరనుంది.

ప్రభుత్వాదాయం తగ్గే మార్గాలివి..
వార్షిక ఆదాయం రూ.2-5 కోట్లు, అంత కంటే ఎక్కువ ఉన్న సంపన్నులపై ఆదాయం పన్ను రేటు పెంపు ద్వారా ఏటా రూ.12వేల కోట్ల నుంచి రూ.13వేల కోట్లు, బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకం పెంపు ద్వారా మరో రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల ఆదాయం సమకూరనుంది. 

రూ.400 కోట్ల టర్నోవర్ గల సంస్థలపై టాక్స్ 25 శాతానికి తగ్గింపు
రూ.400 కోట్ల వరకు వార్షిక టర్నోవర్‌ ఉన్న కంపెనీలపై ఆదాయ పన్ను రేటును 30% నుంచి 25 శాతానికి తగ్గించడంతో కార్పొరేట్‌ టాక్స్‌ రాబడుల్లో రూ.4,000 కోట్లు కోత పడుతుందని అంచనా. వీటిని పక్కన పెట్టినా బడ్జెట్‌ ప్రతిపాదనలతో ఈ ఆర్థిక సంవత్సరం నికర పన్నుల రాబడి రూ.30వేల కోట్ల వరకు పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

భారత్‌లో సంపన్నులపై పన్ను తక్కువే..
అమెరికా, దక్షిణాఫ్రికా, చైనాలతో పోల్చితే భారత్‌లో సూపర్‌ రిచ్‌ (సంపన్నులు)లపై విధిస్తున్న పన్ను ఇంకా తక్కువ స్థాయిలోనే ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. సంపన్నులపై విధిస్తున్న పన్నును 45 శాతానికి పెంచటాన్ని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే సమర్థించారు. పలు దేశాలతో పోల్చినా ఇప్పటికీ ఈ పన్ను ఇంకా తక్కువ స్థాయిలోనే ఉందన్నారు.

చైనా, సౌతాఫ్రికాల్లో రిచ్‌లపై పన్ను 45 శాతం
చైనా, దక్షిణాఫ్రికా దేశాల్లో సంపన్నులపై విధిస్తున్న పన్ను 45 శాతంగా ఉండగా అమెరికాలో 50.3 శాతంగా ఉందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే పేర్కొన్నారు. మరోవైపు బ్రిటన్‌లో ఇది 45 శాతం, జపాన్‌లో 45.9 శాతం, కెనడాలో 54 శాతం, ఫ్రాన్స్‌లో 66 శాతంగా ఉంది.

రూ.5 కోట్ల ఆదాయం వరకు 39 శాతానికి ఐటీ
రూ.2 నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారిపై ఆదాయ పన్నును 35.88 శాతం నుంచి 39 శాతానికి, రూ.5 కోట్లకు పైబడి ఆదాయం ఉన్న వారిపై పన్నును 42.7 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయం ఆర్జిస్తున్న వారు ఉన్నారని, వారికి ఒకటే పన్నును విధించటం సరికాదని పాండే అన్నారు.

click me!