
విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలకు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. NTPC గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో వివిధ రాష్ట్రాలు ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ బకాయిలను త్వరగా క్లియర్ చేయాలని ప్రధాని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ రంగాలను సమర్ధవంతంగా, లాభసాటిగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల అమలులో భాగంగా.. రాష్ట్రాల పంపిణీ సంస్థల ద్వారా ఉన్న భారీ బకాయిలను తీర్చే ప్రతిపాదనను స్వయంగా ప్రధాని ముందుంచారు. పోటీని తట్టుకునే విద్యుత్ చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతున్న నేపధ్యంలో, రాష్ట్రాల్లోని వివిధ విద్యుత్ పంపిణీ బోర్డులు, ఉత్పత్తి, పంపిణీ సంస్థల ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధాని సూచించారు. .
విద్యుత్ ఉత్పత్తి సంస్థకు పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు, పంపిణీ సంస్థలకు వివిధ ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయిలు విద్యుత్ రంగంలో పెను సంక్షోభానికి కారణమవుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. గత నెలలో జరిగిన ముఖ్య కార్యదర్శుల సమావేశంలో కూడా ప్రధాని ఈ విషయాన్ని ప్రస్తావించారు. 11,935 కోట్లు బకాయిపడిన డిఫాల్టర్ల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో రూ. 9,131 కోట్లతో మహారాష్ట్ర రెండవ అత్యధిక బాకీలను కలిగి ఉంది. మూడో స్థానంలో రూ. 9,116 కోట్లతో ఆంధ్ర ప్రదేశ్ ఉంది.
మొండి బకాయిల సంఖ్యలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ముందున్నాయి. మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలు. ప్రభుత్వ సంస్థలు కూడా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వివిధ రంగాలకు ఉచిత విద్యుత్ అందించినందుకు చాలా రాష్ట్రాలు విద్యుత్ పంపిణీ కంపెనీలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం రూ.1,01,442 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో 26,397 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థలు బకాయిపడ్డాయి. అదే సమయంలో, వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యుత్ పంపిణీ సంస్థలకు 62,931 కోట్ల బకాయిలు ఉన్నాయి. దీనితో పాటు వివిధ రాష్ట్రాలకు విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా రాష్ట్రాల నుండి రూ. 76,337 కోట్ల సబ్సిడీని పొందుతున్నాయి.