
స్టాక్ మార్కెట్ సోమవారం ప్రారంభంలోనే కుప్పకూలింది. గతవారం 1100 పాయింట్లు నష్టపోయిన సూచీలు, ఈ వారం మొదటి గంటలోనే అంతకుమించి నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 57,500 పాయింట్ల దిగువకు, నిఫ్టీ 17200 పాయింట్ల దిగువకు వచ్చింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, ద్రవ్యోల్భణ ఆందోళనలు వంటి అంశాలు మార్కెట్ పైన ప్రభావం చూపాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అయితే ఏకంగా 7 శాతం క్షీణించింది. త్రైమాసిక ఫలితాల తర్వాత కూడా కోలుకోలేదు. టీసీఎస్ కూడా 1.5 శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అయింది.
సెన్సెక్స్ గతవారం 58,339 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారం ఆరంభమే 1000 పాయింట్ల మేర నష్టపోయి 57,338 పాయింట్ల వద్ద మొదలైంది. 57,420 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,152 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.10 సమయానికి సెన్సెక్స్ 1170 పాయింట్లు నష్టపోయి 57,172 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో దాదాపు 1200 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 308 పాయింట్లు క్షీణించి 17,167 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
రంగాలవారీగా చూస్తే ఐటీ రంగం 4 శాతం మేర నష్టాల్లో కనిపించింది. అయితే ఆ తర్వాత కాస్త కోలుకుంది. బ్యాంకింగ్ సూచీ 1 శాతం క్షీణించాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్, గ్యాస్ అండ్ పెట్రోలియం, ఆటో, టెలికమ్యూనికేషన్స్, సిమెంట్ రంగాల్లో మాత్రమే కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. అయితే దిగ్గజ స్టాక్స్ అన్నీ ఐటీ, బ్యాంకింగ్ కాబట్టి మార్కెట్లు భారీగా నష్టాల్లో ఉన్నాయి. దేశీయంగా ద్రవ్యోల్భణం నమోదవడం మార్కెట్లలో అప్రమత్తత కనిపించింది. అమెరికా అధిక ద్రవ్యోల్భణం కూడా ప్రభావం చూపింది. పరపతి విధానం కఠినంగా ఉండవచ్చుననే అంచనాలతో విదేశీ నిధుల ప్రవాహం స్తబ్దుగా ఉండొచ్చునని భావిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ ప్రభావంపైన దృష్టి సారిస్తున్నారు.
ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, దివీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, మారుతీ సుజికీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా,హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, లార‍్సెన్, కొటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.