Edible Oil Usage: వంట నూనె ధరలు పెరిగాయని ఏం చేస్తున్నారో తెలుసా..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 13, 2022, 10:53 AM ISTUpdated : Apr 13, 2022, 10:54 AM IST
Edible Oil Usage: వంట నూనె ధరలు పెరిగాయని ఏం చేస్తున్నారో తెలుసా..?

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్‌లోనూ ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ధరలు కొండెక్కడంతో భారతీయులు వంట నూనె వాడకాన్ని బాగా తగ్గించేశారు. దాదాపుగా 29 శాతం మంది నూనె వాడకాన్ని తగ్గించేశారు. ముడి సరకుల ధరలు పెరగడంతో మరో 17 శాతం ఖర్చు చేయడం తగ్గించుకున్నారని ఓ నివేదిక తెలిపింది.  

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంటనూనె ధరలు గతంలో ఎన్నడూ లేనిస్థాయికి పెరిగిన విషయం తెలిసిందే. మార్కెట్‌లో లీడింగ్ కంపెనీల లీటర్ నూనె ధరలు రూ.220ని దాటాయి. అయితే కేంద్రం చర్యల కారణంగా ఇటీవల కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అయినప్పటికీ ధరలు మాత్రం భారీగానే ఉన్నాయి. దీంతో భారతీయ కుటుంబాలు ఎడిబుల్ ఆయిల్ వినియోగాన్ని దాదాపు 29 శాతం మేర తగ్గించాయి. మరో 17 శాతం కుటుంబాలు అనవసర ఖర్చులను తగ్గించుకున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.

దేశంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు తమ సేవింగ్స్‌ను ఖర్చు చేయడం ద్వారా ప్రస్తుత అధిక ధరల నుండి గట్టెక్కుతున్నారు. ప్రతి పదిమందిలో తొమ్మిది మంది సేవింగ్స్ తగ్గించుకోవడం ద్వారా నూనెలకు ఎక్కువ ధరలను చెల్లిస్తున్నారు. అంతేకాదు, బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్, అన్యాయమైన వాణిజ్య విధానాలు, ఎడిబుల్ ఆయిల్స్ పైన వాణిజ్య మార్జిన్స్‌ను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చాలామంది కోరినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోకల్ సర్కిల్స్ సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి. కరోనా ముందుస్థాయితో పోలిస్తే సన్‌ఫ్లవర్, పల్లి నూనె తదితర ధరలు 50 శాతం నుండి 70 శాతం పెరిగాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ఈ ధరలు భారీగా నమోదయ్యాయి.

అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల నుండి భారత్ 85 శాతం సోయాబీన్ నూనెను దిగుమతి చేసుకుంటుంది. అలాగే, రష్యా, ఉక్రెయిన్ దేశాల నుండి 90 శాతం సన్‌‍ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుంటుంది. మలేషియా, ఇండోనేషియా దేశాల నుండి అత్యధిక పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. నూనె ధరలు తగ్గించేందుకు కేంద్రం చాలాకాలంగా ఎన్నో చర్యలు తీసుకుంటోంది. గత డిసెంబర్ నెలలో పామాయిల్ పైన 12.5 శాతం నుండి 17.5 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. తద్వారా సామాన్యులపై భారం పడకుండా ప్రయత్నం చేసింది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సరఫరా గొలుసు ఇబ్బందులకు తోడు ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

పెరుగుతున్న వంట నూనెల ధరలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అక్రమ నిల్వలను అరికట్టడంపై దృష్టి సారించింది. ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో పెద్ద ఎత్తున నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. రిటైలర్లు, హోల్ సేలర్లు సహా పెద్ద వ్యాపారుల నిల్వ కేంద్రాలపై అధికారులు అకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనల ప్రకారం రిటైల్ వ్యాపారుల వద్ద 30 క్వింటాళ్లు, హోల్ సేల్ వ్యాపారుల వద్ద 500 క్వింటాళ్లకు మించి నిల్వలు ఉండరాదు. డిపోలలో 1000 క్వింటాళ్లు, హోల్ సేల్ డీలర్ల వద్ద 2000 క్వింటాళ్ల వరకే నూనెలు ఉంటాయి.

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు